స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పనితీరుపై శ్వేత పత్రం విడుదల చేయాలి
ఎస్సీ వర్గాల సంక్షేమానికి ఏం చేశారు..? నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ...?
కమిషన్ల వ్యవహారంతోనే అభివృద్ధి పనులు నిలిచిపోయాయి
కాడ్లాపూర్ రైతులను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం దారుణం
మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 13): కాడ్లాపూర్ రైతుల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తీవ్రంగా స్పందించారు. రైతులను అర్ధరాత్రి అరెస్ట్ చేసి వికారాబాద్‌కు తరలించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు. రైతుల సమస్యలపై జిల్లా ఎస్పీని కలిసి అనంతరం మీడియాతో మాట్లాడారు.కాడ్లాపూర్‌కు చెందిన 14–15 మంది రైతులను అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేసి డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉంచారని, అక్కడ కనీసం తాగునీరు, ఆహారం కూడా అందుబాటులో లేకపోవడంతో రైతులు తమకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారని ఆయన తెలిపారు. రైతులను పరామర్శించేందుకు తాము బయలుదేరిన విషయం తెలుసుకుని వారిని మరో ప్రాంతానికి తరలించారని ఆరోపించారు.భూములు ఇవ్వబోమని చెప్పడం తప్ప రైతులు చేసిన తప్పేమిటని ఆనంద్ ప్రశ్నించారు. తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వబోమని ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేసిన రైతులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఎస్పీని కోరినట్లు, దీనిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని తెలిపారు.
స్పీకర్ పనితీరుపై ప్రజలకు సమాధానం చెప్పాలి
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఎస్సీ వర్గాల సంక్షేమం కోసం స్పీకర్‌గా ఏం చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు ఏమిటో ప్రజల ముందు ఉంచాలని ప్రశ్నించారు.వికారాబాద్‌లో పలు అభివృద్ధి పనులు నిలిచిపోవడానికి కమిషన్ల వ్యవహారమే కారణమని ఆనంద్ ఆరోపించారు. అభివృద్ధి పనుల పరిస్థితి, వాటి పురోగతి, నిధుల వినియోగంపై స్పీకర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు స్పీకర్ స్పందించాలని కోరారు.
మాట ఒకటి.. అసెంబ్లీలో చెప్పేది మరొకటా...?
గతంలో కాంగ్రెస్ నాయకులు రైతులకు భూములు ఇవ్వాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారని, ఇప్పుడు అదే రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని అసెంబ్లీలో చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆనంద్ ప్రశ్నించారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.కాడ్లాపూర్ రైతుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెంటనే స్పందించాలని ఆనంద్ డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన ఒత్తిళ్లను నిలిపివేసి, వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని కోరారు. ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, గోపాల్, కౌన్సిలర్ల, నాయకులు ఉన్నారు.