బీసీ జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోంది.. కేంద్రంపై కల్వకుంట్ల కవిత ధ్వజం
సూర్య తెలంగాణ డెస్క్: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జనగణనలో బీసీ కులాల జనాభాను తక్కువగా చూపేలా రాజకీయ కుట్ర జరుగుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్, సకల జన సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలిటిక్స్ బియాండ్ క్యాస్ట్ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఓబీసీ కాలమ్‌ను కేవలం నామమాత్రంగా ఉంచి బలహీన వర్గాలను కుల సమూహాలుగా విడగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కుల గణనకు ఇంకా నాలుగు నెలల సమయం ఉందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎలాంటి గందరగోళానికి తావులేకుండా బీసీ ఉప కులాలను కూడా స్పష్టంగా కలిపి లెక్కించాలని డిమాండ్ చేశారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒకే కులానికి భిన్నమైన సామాజిక హోదాలు ఉంటాయని, ఈ సమస్యను పరిష్కరించాలంటే ఉప కులాల వారీగా లెక్కించడం తప్పనిసరి అని కవిత స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని ఉపకులాల విషయంలో ఎదురవుతున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బీసీ గణనలో ఆ తప్పులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో బీసీ జనాభా తక్కువగా చూపబడిందని, కేంద్రం ద్వారా ఆ సమస్య తీరుతుందని ఆశించినా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కులం కోసం ప్రత్యేక కాలమ్ కచ్చితంగా ఉండాలని, బాధితుల కోణం నుంచి ఆలోచించి ఈ జఠిలమైన సమస్యకు సరైన పరిష్కారాలు చూపాలని కోరారు.
కుల వివక్ష అనేది మన డీఎన్ఏలోనే పాతుకుపోయిందని, రాజ్యాధికారంలో ఉన్నవారితో పాటు అన్ని పార్టీలు ప్రతి కులాన్ని ఆర్థికంగా, రాజకీయంగా సాధికారత వైపు నడిపించాలని కవిత పిలుపునిచ్చారు. చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ సమాజం ఆలోచన విధానం మారినప్పుడే కుల వివక్ష నిర్మూలన సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ, పురుషులతో సమానంగా శ్రమిస్తున్న మహిళలకు నేటికీ వేతనాల్లో వ్యత్యాసం చూపడం అన్యాయమని పేర్కొన్నారు. మహిళల శ్రమకు తగిన విలువ ఇస్తేనే నిజమైన సామాజిక పురోగతి సాధ్యపడుతుందని ఆమె అన్నారు.