22ఏ భూముల విషయంలో రేవంత్ డ్రామాలు ఆపాలి* *సాగర్ రైతులకు అన్యాయం చేస్తే బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదు: మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి*
*
సూర్యాపేట: 22ఏ భూముల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్ని డ్రామాలు చేసినా ప్రజల నుంచి ప్రశ్నలు తప్పవని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఇతరులపై ఆరోపణలు చేస్తూ అసలు సమస్యల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. 22ఏ భూముల విషయంలో బాధితులకు న్యాయం చేయాలని, తమను శాసనసభకు అనుమతించి చర్చకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమను సభ నుంచి బయటకు పంపించి చర్చ లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎర్రవల్లి భూముల సర్వే విషయంలో దళిత రైతులు తమ భూముల్లో తామే ఉన్నామని స్పష్టం చేశారని అన్నారు. నోటీసులు ఇవ్వకుండా సర్వే పేరుతో ఫామ్‌హౌస్ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. 22ఏ భూముల సమస్యను పరిష్కరించకుండా కాలయాపన, దృష్టి మళ్లింపు కోసమే ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశారని ఆరోపించారు. భూముల విషయంలో ప్రభుత్వం చేస్తున్న చర్యలపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.సాగర్ రైతులు ఇప్పటికైనా మేల్కొనాలని జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు రైతులకు అన్యాయం చేస్తూ తూములు మూసివేయాలని ఆదేశాలు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. స్థానిక రైతుల పొలాలను ఎండబెట్టి ఖమ్మం జిల్లా వైరా వైపు నీటిని తరలించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సాగునీరు, విద్యుత్, తాగునీటి సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు.సాగర్ ఆయకట్టు రైతులకు అన్యాయం జరిగితే బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని,రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.