ఢిల్లీలో యాక్టివ్ రోబోట్ సహాయంతో సిరామిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స!
న్యూఢిల్లీ:వైద్య రంగాన ఒక వినూత్న మైలురాయి నమోదైంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యాక్టివ్ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్‌ను, పూర్తిగా లోహం లేని సిరామిక్ (Ceramic) ఇంప్లాంట్‌తో అనుసంధానించి ఢిల్లీ వైద్యులు విజయవంతంగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. సాకేత్‌లోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ సుజోయ్ భట్టాచార్జీ, జర్మన్ ఆర్థోపెడిక్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ మైఖేల్ వాగ్నర్ బుధవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
సాంప్రదాయక మోకాలి మార్పిడిలో ఎక్కువగా లోహ భాగాలను ఉపయోగిస్తుండగా, ఈ నూతన విధానంలో లోహేతర/సిరామిక్ ఇంప్లాంట్‌ను వాడారు. దీనికి యాక్టివ్ రోబోటిక్ టెక్నాలజీని జోడించడం ద్వారా ఎముకను సిద్ధం చేయడం, ఇంప్లాంట్ అమరికలో సబ్-మిల్లీమీటర్ కచ్చితత్వాన్ని (Sub-millimeter precision) సాధించగలిగినట్లు వైద్యులు తెలిపారు. ఈ రకమైన సాంకేతిక కలయిక భవిష్యత్తులో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సల్లో సరికొత్త విప్లవానికి బాటలు వేస్తుందని డాక్టర్ భట్టాచార్జీ ఆశాభావం వ్యక్తం చేశారు.