ముద్రా లబ్ధిదారులకు ఆర్థిక అక్షరాస్యతను పెంచాలి: సీతారామన్
న్యూఢిల్లీ:ప్రధానమంత్రి ముద్రా యోజన (PMMY) కింద రుణాలు పొందుతున్న చిన్న పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను మరింతగా విస్తరించుకునేందుకు వీలుగా బ్యాంకులు రాష్ట్రాలవ్యాప్తంగా ఆర్థిక అక్షరాస్యత ప్రయత్నాలను ముమ్మరం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. గురువారం పీఎం ముద్రా యోజన లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆమె, పూచీకత్తు లేని ఈ రుణాల ద్వారా లబ్ధిదారులు సకాలంలో చెల్లింపులు జరిపి మంచి క్రెడిట్ రికార్డును పెంపొందించుకోవచ్చని వివరించారు. దీనివల్ల భవిష్యత్తులో వారు పెద్ద మొత్తంలో రుణాలు పొంది మరింత వృద్ధి సాధించేందుకు మార్గం సుగమమవుతుందన్నారు.
నాగాలాండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన పలువురు లబ్ధిదారులు ఈ సందర్భంగా తమ విజయగాథలను మంత్రికి వివరించారు. ముద్రా రుణాల ద్వారా వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు పలువురికి ఉపాధి కల్పిస్తున్నామని లబ్ధిదారులు తెలిపారు. 2014లో జన్ ధన్ యోజనతో ప్రారంభమైన ఆర్థిక విప్లవం, 2015లో ప్రారంభమైన ముద్రా పథకంతో చిన్న పారిశ్రామికవేత్తలకు గొప్ప ప్రోత్సాహాన్ని అందించిందని మంత్రి సీతారామన్ పునరుద్ఘాటించారు. స్వయం సమృద్ధిని సాధిస్తూ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న చిన్న వ్యాపారులపై ప్రభుత్వానికి పూర్తి నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు.