తిమ్మాజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
తిమ్మాజిపేట (నాగర్ కర్నూల్): నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో స్మార్ట్ రేషన్ కార్డులు మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ప్రయోజనాలు చేకూరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు చేతికి అందడంతో లబ్ధిదారులు, స్థానిక ప్రజలు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.
ఈ పంపిణీ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిలుక వివేక్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, మల్లయ్య గౌడ్‌లతో పాటు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.