మధ్య వయస్సులోని మహిళలు ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి – మిసెస్ ఇండియా యూఎస్‌ఏ డాక్టర్ మాలిని సందడి
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషిన్స ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఆపి) ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తన్వీర్ హాస్పిటల్‌లో నిర్వహించిన ఆరోగ్య అవగాహన సదస్సుకు మిసెస్ ఇండియా యూఎస్‌ఏ డాక్టర్ మాలినీ దాసరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైద్యురాలిగా అమెరికాలో విశేష అనుభవం కలిగిన డాక్టర్ మాలినీ రుమటాలజీ, ఒబెసిటీ మెడిసిన్ రంగాల్లో నైపుణ్యం కలిగిన వైద్య నిపుణురాలు కావడంతో ‘మిడ్‌లైఫ్ మెటబాలిక్ మేకోవర్’ అంశంపై ప్రత్యేకంగా ప్రసంగించి మహిళల్లో ఆరోగ్య చైతన్యాన్ని కలిగించారు. మధ్య వయస్సులో మహిళల శరీరంలో వచ్చే మార్పులను కేవలం బరువు పెరగడంగా చూడకూడదని డాక్టర్ మాలినీ పేర్కొన్నారు. ‘‘వయస్సు పెరుగుతున్న కొద్దీ హార్మోన్ల మార్పులు, కండరాల పరిమాణం తగ్గడం, శరీరంలో కొవ్వు నిల్వ విధానంలో మార్పులు, నిద్ర, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ వంటి అనేక అంశాలు మెటబాలిక్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల మిడ్‌లైఫ్‌లో కేవలం బరువు తగ్గడమే లక్ష్యంగా కాకుండా, సరైన పోషకాహారం, క్రమమైన శారీరక వ్యాయామం, తగిన నిద్ర, ఒత్తిడి నియంత్రణతో పాటు అవసరమైన ఆరోగ్య పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలి. చిన్న చిన్న జీవనశైలి మార్పులను నిరంతరంగా కొనసాగిస్తే ఆరోగ్యకరమైన మధ్య వయస్సును నిర్మించుకోవచ్చు’’ అని ఆమె వివరించారు. డాక్టర్ మాలినీ మాట్లాడుతూ మహిళలు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల చూపే శ్రద్ధను తమ ఆరోగ్యం విషయంలోనూ చూపాలని సూచించారు. ముఖ్యంగా మధ్య వయస్సు అనేది ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమయ్యే దశగా భావించకుండా, భవిష్యత్ ఆరోగ్యానికి కొత్త పునాది వేసుకునే అవకాశంగా చూడాలని చెప్పారు. శరీరం పంపే సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా, ముందస్తు వైద్య పరీక్షలు, వైద్యుల సలహా, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా మెటబాలిక్ సమస్యలను సమర్థంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు. వైద్య రంగంలో విశేష అనుభవంతో పాటు మిసెస్ ఇండియా యూఎస్‌ఏ, మిసెస్ తెలుగు యూఎస్‌ఏగా గుర్తింపు పొందిన డాక్టర్ మాలినీ సదస్సుకు హాజరుకావడంతో తన్వీర్ హాస్పిటల్‌లో ప్రత్యేక సందడి నెలకొంది. వైద్య నిపుణురాలిగా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూనే, మరోవైపు అంతర్జాతీయ వేదికలపై భారతీయ మహిళల ఆత్మవిశ్వాసం, ప్రతిభను ప్రతిబింబిస్తున్న ఆమెతో పలువురు ముచ్చటించారు. ఈ ఆరోగ్య సదస్సుకు ఏ ఏ పి ఐ (ఆపి) ఇండియా కో–ఆర్డినేటర్ డాక్టర్ ద్వారకానాథ రెడ్డి, డాక్టర్ మీటా, డాక్టర్ నౌనిహాల్ సింగ్ నాయకత్వం వహించారు.