ప్రధాని, సీఎంలకు బాంబు బెదిరింపుల కేసు.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ఇద్దరి అరెస్ట్
ప్రధాని మోదీ, అమిత్ షా, గుజరాత్ సీఎంలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పంపిన అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 5 లక్షలకు పైగా ఈమెయిల్ ఐడీల డేటాను స్వాధీనం చేసుకున్నారు.
వార్త:
గుజరాత్ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎంను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపుల ఈమెయిల్స్ పంపిన అంతర్రాష్ట్ర ముఠాను గుజరాత్ ‘సైబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ పోలీసులు ఛేదించారు.
డిజిటల్ ఆధారాల ఆధారంగా బిహార్, ఝార్ఖండ్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో రోషన్ కుమార్, ప్రధాన సూత్రధారి గుల్షన్ కుమార్ సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 5,13,847 ఈమెయిల్ ఐడీలు, పాస్వర్డ్లను స్వాధీనం చేసుకున్నారు. పాఠశాలలు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలకు మరిన్ని బెదిరింపు మెయిల్స్ పంపేందుకు ఈ డేటాను సేకరించినట్లు తేలింది.
ఈ కుట్ర వెనుక బంగ్లాదేశ్‌కు చెందిన ఒక గ్రూప్ హస్తం ఉన్నట్లు, క్రిప్టో వ్యాలెట్ల ద్వారా వీరికి నిధులు అందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇలాంటి బెదిరింపు సందేశాలు వస్తే భయాందోళనలకు గురికాకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.