2014 నుంచి రెట్టింపుపైగా పెరిగిన వైద్య కళాశాలలు
కేంద్ర మంత్రి జె.పి. నడ్డా
న్యూఢిల్లీ: దేశంలో 2014 నుంచి వైద్య విద్యారంగం వేగవంతమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా స్పష్టం చేశారు. తైమూర్-లెస్టేలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ (RC79) 79వ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014తో పోలిస్తే దేశంలో వైద్య కళాశాలల సంఖ్య 387 నుండి 858కి (రెట్టింపుకు పైగా) పెరిగిందని ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో ఎంబీబీఎస్ (MBBS) సీట్లు 177.45 శాతం పెరిగి 51,348 నుంచి 1,42,464కు చేరగా, పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) సీట్లు 176.69 శాతం పెరిగి 31,185 నుంచి 86,287కు పెరిగినట్లు తెలిపారు.
ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, వైద్య విద్యా మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా గ్రామీణ, గిరిజన, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యాయి. 2028-29 నాటికి అదనంగా మరో 10,000 పీజీ సీట్లను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అత్యవసర వైద్యం, వృద్ధుల సంరక్షణ, మానసిక వైద్యం వంటి విభాగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని నడ్డా పేర్కొన్నారు. అలాగే 157 కొత్త నర్సింగ్ కళాశాలల ఏర్పాటు ద్వారా ఏటా 15,700 మంది నర్సింగ్ గ్రాడ్యుయేట్లు అందుబాటులోకి వస్తారని, వచ్చే ఐదేళ్లలో లక్ష మంది అనుబంధ ఆరోగ్య సంరక్షణ నిపుణులను తయారు చేయనున్నామని వివరించారు.
డిజిటల్ ఆరోగ్యం, ఇ-సంజీవని, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా మారుమూల ప్రాంతాలకు టెలికన్సల్టేషన్ సేవలు అందుతున్నాయని మంత్రి నడ్డా తెలిపారు. కాగా, ఈ సమావేశంలో సభ్య దేశాల ఆరోగ్య మంత్రులు ఆరోగ్య సిబ్బంది కొరతను తీర్చడం, గ్రామీణ ప్రాంతాల్లో నిపుణులను అందుబాటులో ఉంచడం లక్ష్యంగా "ఆరోగ్యం కోసం మానవ వనరులపై దిలీ ప్రకటన: ప్రత్యేక సంరక్షణలో సమానత్వం"ను ఆమోదించారు.