ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న బ్రిక్స్
2026 శిఖరాగ్ర సదస్సు ప్రత్యేక కథనం
న్యూఢిల్లీ: ప్రారంభమైన ఇరవై ఏళ్లలో 'బ్రిక్స్' (BRICS) కూటమి ఒక సాధారణ ఆర్థిక వేదిక స్థాయి నుంచి ప్రపంచ ఆర్థిక, రాజకీయ సమతుల్యతను మార్చే ప్రధాన శక్తిగా ఆవిర్భవించింది. కొనుగోలు శక్తి సమానత (PPP) ప్రాతిపదికన 2024 నాటికి ప్రపంచ జీడీపీలో బ్రిక్స్ వాటా దాదాపు 40 శాతానికి చేరింది. ఇది జీ7 (G7) దేశాల వాటా (29 శాతం) కంటే గణనీయంగా ఎక్కువ కావడం విశేషం.
ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి సంస్థ (UNCTAD) గణాంకాల ప్రకారం, 2003లో 84 బిలియన్ డాలర్లుగా ఉన్న బ్రిక్స్ సభ్య దేశాల మధ్య వాణిజ్యం, 2024 నాటికి 1.17 ట్రిలియన్ డాలర్లకు (13 రెట్లకు పైగా) విస్తరించింది. ప్రపంచ వస్తువుల ఎగుమతుల్లో ఈ కూటమి వాటా 12 శాతం నుంచి 24 శాతానికి రెట్టింపు అయింది. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, యూఏఈ, సౌదీ అరేబియా వంటి కొత్త దేశాల చేరికతో ప్రపంచ ఉత్పత్తి, తయారీ, వస్తు సరఫరా గొలుసుల్లో ఈ కూటమి కీలక పాత్ర పోషిస్తోంది.
సాంప్రదాయ బ్రెటన్ వుడ్స్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా 2014లో ఏర్పాటు చేసిన 'న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్' (NDB) మౌలిక సదుపాయాల కల్పనకు, సుస్థిర అభివృద్ధికి స్థానిక కరెన్సీల్లో నిధులు సమకూరుస్తూ గ్లోబల్ సౌత్ దేశాలకు ఆర్థిక ఊతాన్నిస్తోంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, అమెరికా డాలర్‌పై మితిమీరిన ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో స్థానిక కరెన్సీల వాడకాన్ని బ్రిక్స్ గణనీయంగా పెంచుతోంది.
ఈ కూటమిలో చైనా ఆధిపత్య ఉత్పాదక శక్తిగా కొసాగుతుండగా, సభ్య దేశాలలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల మధ్య లోతైన సంస్థాగత, వ్యాపార సంబంధాలు మరింత పటిష్టం కావాల్సి ఉందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ప్రస్తుత ప్రపంచ వ్యవస్థకు ప్రత్యక్ష సవాలు విసరడం కంటే, ఆచరణాత్మక ఆర్థిక సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా భారత్ వ్యవహరిస్తోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) కేంద్రంగా పనిచేసే బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు మద్దతు ఇస్తూనే, ప్రపంచ ఆర్థిక సంస్థల్లో వర్ధమాన దేశాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని 2026 బ్రిక్స్ అధ్యక్ష హోదాలో న్యూఢిల్లీ ఆకాంక్షిస్తోంది.