గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026
డిజిటల్ ఫైనాన్స్‌లో ఆధిపత్యం చాటుతున్న భారత్
ముంబై: భారతదేశం తన పటిష్టమైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI), ఆధునిక చెల్లింపు వ్యవస్థలతో ప్రపంచ ఫిన్‌టెక్ రాజధానిగా ఎదిగిందని చాటుతూ 'గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF) 2026' ఏడవ ఎడిషన్ ముంబై వేదికగా వైభవంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 8 నుండి 11 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సును పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), ఫిన్‌టెక్ కన్వర్జెన్స్ కౌన్సిల్ (FCC) ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక, ఐటీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలతో పాటు ఆర్‌బీఐ, సెబీ, నీతి ఆయోగ్ వంటి కీలక రెగ్యులేటరీ సంస్థలు ఈ ఈవెంట్‌కు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి.
“ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటం టెక్నాలజీ” అనే ప్రధాన అంశాలపై ఆధారపడి సమ్మిళిత డిజిటల్ ఫైనాన్స్ భవిష్యత్తును తీర్చిదిద్దడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. డిజిటల్ రంగంలో భారత్ సాధించిన ప్రగతిని వివరిస్తూ... ఆగస్టు 2026 నాటికి జన్ ధన్ ఖాతాలు 59.15 కోట్లకు, ఆధార్ నమోదులు 144 కోట్లకు చేరుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్త రియల్-టైమ్ డిజిటల్ లావాదేవీల్లో దాదాపు సగం వాటా కలిగి ఉన్న 'యూపీఐ' ప్రస్తుతం 11 దేశాల్లో సేవలందిస్తోందని, ఆగస్టు 2026లోనే దాదాపు 2,450 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు అందించిన ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) రూ. 53.26 లక్షల కోట్లకు చేరిందని, వినియోగదారుల భద్రత కోసం ఆర్‌బీఐ ప్రత్యేక స్వీయ-నియంత్రణ చట్రాన్ని కూడా అమలు చేస్తోందని స్పష్టం చేశారు.