ఆశా భోస్లే జన్మదినం సందర్భంగా ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన 'ఆశా ఫరెవర్' గీతం ఆవిష్కరణ
ముంబై: దిగ్గజ నేపథ్య గాయని, పద్మవిభూషణ్ ఆశా భోస్లే జన్మదినాన్ని పురస్కరించుకుని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం ప్రత్యేక నివాళి గీతాన్ని విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన 'ఆశా ఫరెవర్' అనే ఈ ప్రత్యేక గీతావిష్కరణ కార్యక్రమంలో రెహమాన్, మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి ఆశిష్ షెలార్, గాయని జానై భోస్లేలతో పాటు పలువురు రాజకీయ, సాంస్కృతిక ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం ఫడ్నవిస్ మాట్లాడుతూ... ఆశా భోస్లే దివ్య గాత్రం, అసాధారణ భావోద్వేగాలు భారతీయ సంగీతంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. తొమ్మిది పదులు దాటిన వయసులోనూ ఆమె అదే ఉత్సాహంతో పాటలతో అలరించారని, 'ఆశా ఫరెవర్' పాట రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. దశాబ్దాల పాటు వేల పాటలతో అలరించిన ఆశా భోస్లే అద్భుతమైన సంగీత ప్రస్థానానికి గౌరవంగా ఈ గీతాన్ని రూపొందించినట్లు తెలిపారు.