national
హమీద్ అన్సారీ, రాహుల్ గాంధీలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం
సూర్య జాతీయ డెస్క్: భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని మాజీ ఉపరాష్ట్రపతి మహమ్మద్ హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో కొనసాగిన వ్యక్తులు ఆ స్థానాల ఔన్నత్యాన్ని విస్మరించి మాట్లాడటం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆక్షేపించారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన ప్రేరణా విమర్శ్ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, భారత వైభవాన్ని అంతర్జాతీయంగా దిగజార్చే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. దేశ సమగ్రతను, సాంస్కృతిక వారసత్వాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం దేశ వ్యతిరేక శక్తుల ఎజెండాలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు.
భారతదేశ ఆత్మ సనాతన ధర్మంలోనే దాగి ఉందని, ఇక్కడి సమాజం ఎల్లప్పుడూ రిషి పరంపరను, పూర్వీకుల జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక కేంద్రాలను గౌరవిస్తూ వచ్చిందని సీఎం యోగి పేర్కొన్నారు. సనాతన ధర్మం సర్వే భవంతు సుఖినః, వసుధైవ కుటుంబకం అనే మహోన్నత ఆదర్శాలను విశ్వానికి చాటిచెప్పిందని, అలాంటి సార్వత్రిక భావనలో మతోన్మాదం లేదా సంకుచితత్వం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. హిందూ సంప్రదాయాలను కించపరిచేలా, తీవ్రవాదంతో ముడిపెట్టేలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం దేశ ఐక్యతకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని హెచ్చరించారు. వ్యక్తులకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవచ్చని, అయితే రాజ్యాంగ పరిరక్షణ, దేశ సమగ్రత విషయంలో ఎవరైనా హుందాగా నడుచుకోవాలని హితవు పలికారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైఖరిపైనా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతీయ సమాజంలో స్త్రీలకు, వృద్ధులకు ఇచ్చే గౌరవం సంస్కారానికి నిదర్శనమని, అయితే ప్రతిపక్ష నేతలు నిరంతరం మాతృశక్తిని, భారతీయ ఆచారాలను చులకన చేసి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. దేశ యువతలో తమ మూలాలపై అయోమయం సృష్టించి, సంక్షోభాన్ని రేకెత్తించే రాజకీయాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. భారత సనాతన మూలాలను విమర్శించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న వారి నుంచి దేశం ఎలాంటి ఆశలూ పెట్టుకోలేదని, తప్పుడు ప్రచారాలతో దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని చూసే కుట్రలను ప్రజలు ఎప్పటికప్పుడు తిప్పికొడతారని స్పష్టం చేశారు.