అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ
అర్చకుల సమస్యలకు పరిష్కార బాట!
నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా
అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్.
అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువారం నిర్వహించిన అర్చక ఫిర్యాదుల దినోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అర్చకులు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
పథకాలు.. సంక్షేమం.. సౌకర్యాలు
ధూపదీప నైవేద్య పథకానికి అర్హత కలిగిన నిరుపేద దేవాలయాలను గుర్తించి నిధులు మంజూరు చేయాలని అర్చకులు కోరారు. దేవాదాయ భూములు సాగు చేస్తున్న అర్చకులకు రైతు భరోసా, పంట నష్టపరిహారం, బీమా వంటి రైతు సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అర్చకులకు గుర్తింపు కార్డులు, వసతి గృహ రుణాలు, వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపు, ఉపనయన సహాయం, దహన సంస్కారాల ఆర్థిక సాయం వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు.
అర్చకుల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించిన సహాయ కమిషనర్ సుధారాణి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలను వేగవంతం చేస్తామని తెలిపారు. నెలాఖరులోగా పరిష్కరించగల సమస్యలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అర్చకుల్లో ఆశాభావం వ్యక్తమైంది.
కార్యక్రమంలో దేవాదాయ శాఖ తనిఖీ అధికారి వన్నూరు స్వామి, కార్యనిర్వహణాధికారులు మల్లికార్జున, దాసు, నరసింహారెడ్డి, జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షుడు వై.పి. ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు కోమండూరు మారుతి ప్రసాద్, ప్రతినిధులు గూగూడు రాయల్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.