బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్
విజయవాడలోని కలగ లాడ్జిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. గత నెల 16న ముత్తు పాండియన్ అనే వ్యక్తి లాడ్జిలో హత్యకు గురయ్యాడు.
చెన్నై నుంచి బరంపురం వెళ్తున్న ముత్తు పాండియన్.. తన స్నేహితులతో కలిసి విజయవాడలోని లాడ్జిలో బస చేశాడు. మద్యం మత్తులో స్నేహితుడి భార్యను పాండియన్ దూషించడంతో వివాదం తలెత్తింది. దీంతో స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది.
వివాదం తీవ్రం కావడంతో ముగ్గురు వ్యక్తులు కత్తులతో పాండియన్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన అనంతరం నిందితులు చెన్నైకి పరారయ్యారు.
కేసును దర్యాప్తు చేసిన బెజవాడ పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.