కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...!
తాతా మధు వ్యాఖ్యలపై అసెంబ్లీలో దుమారం.. సీతక్క కన్నీళ్లతో చలించిన గడ్డం ప్రసాద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్( సెప్టెంబర్ 7):
తెలంగాణ శాసనసభలో సోమవారం అనూహ్య భావోద్వేగం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై సభలో తీవ్ర దుమారం రేగింది. ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడుతుండగా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. సీతక్క కన్నీళ్లు చూసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా చలించిపోయి కన్నీళ్లు తుడుచుకున్నారు.
స్పీకర్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన దివంగత తల్లిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతరకరమని అధికారపక్ష సభ్యులు మండిపడ్డారు. స్పీకర్‌కు జరిగిన అవమానం సభ్య సమాజానికే అవమానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సీతక్క తనకు ఐదేళ్లుగా రాఖీ కడుతున్నారని, సోదరిలాంటి ఆమె తన కోసం కన్నీరు పెట్టుకోవడం చూసి తనకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. తాతా మధు వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని అన్నారు.
తీర్మానం చేసి మండలికి
తాతా మధు వ్యాఖ్యలపై అసెంబ్లీలో తీర్మానం చేసి తదుపరి చర్యల కోసం శాసనమండలికి పంపుతామని స్పీకర్ స్పష్టం చేశారు. సభ గౌరవానికి భంగం కలిగించే అంశాల్లో నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు.
రాజకీయ విమర్శలు వ్యక్తిగత దూషణలకు, కుటుంబ సభ్యుల ప్రస్తావనకు దారితీయకూడదనే చర్చ ఈ ఘటనతో మరోసారి తెరపైకి వచ్చింది. సభను నడిపించే స్పీకర్ కుర్చీలో కూర్చున్న వ్యక్తి కన్నీరు తుడుచుకున్న దృశ్యం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.