ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టెక్నాలజీ అనేది మనిషి జీవితాన్ని సులభతరం చేసేందుకే వచ్చిందని, అయితే ఇప్పుడు ఏఐ రూపంలో అది మానవాళి ఉనికికే సవాల్ విసురుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
మానవునికి ప్రధానంగా శారీరక శక్తి, మేధస్సు అనే రెండు బలాల బలం ఉంటుందని వర్మ పేర్కొన్నారు. పారిశ్రామిక విప్లవం సమయంలో యంత్రాలు మనిషి శారీరక శ్రమను ఎలా తగ్గించాయో, ఇప్పుడు ఏఐ అంతకంటే వేగంగా మనిషి మేధోపరమైన పనులను ఆటోమేట్ చేస్తోందని హెచ్చరించారు. కంటెంట్ రైటింగ్, కోడింగ్, డిజైనింగ్, డేటా అనాలిసిస్ వంటి మెదడుతో చేసే పనులను కూడా ఏఐ క్షణాల్లో చేసేస్తోందని, ఇది భవిష్యత్తులో ఉద్యోగాల కోతకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగైపోవని, ఏఐని సమర్థవంతంగా ఉపయోగించుకునే నైపుణ్యం ఉన్నవారి చేతుల్లోకే ఉద్యోగాలు వెళ్లిపోతాయని వర్మ స్పష్టం చేశారు. పాత పద్ధతులనే నమ్ముకుంటూ ముందుకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. మనిషి ఎప్పుడూ శ్రమ తగ్గించుకోవాలని కోరుకుంటాడని, ఇప్పుడు ఏఐ ఆ కోరికను నిజం చేస్తోందని, కానీ ఆ కోరికనే మానవ జాతికి మునుముందు పెద్ద సమస్యగా మారుతుందని ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు.