BREAKING
T20Iల్లో స్మృతి, షెఫాలీ 'సిక్సర్ల' రికార్డ్: ఏషియన్ గేమ్స్‌లో భారత ఓపెనర్ల విధ్వంసకర ప్రదర్శన కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్వానంగా అంతర్గత రోడ్లు బాలాపూర్ గణనాథుని సన్నిధిలో విజయ్ దేవరకొండ.. ప్రత్యేక పూజలు నిర్వహించిన 'రణబాలి' హీరో! ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్.. పోలీసుల కాల్పుల్లో వాంటెడ్ డ్రగ్ పెడ్లర్‌కు తీవ్ర గాయాలు వినాయక నిమజ్జనంలో దిల్ రాజు దంపతుల మాస్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్! తిమ్మాపూర్ ఎస్‌బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి భారీ చోరీ… ఇట్లు అర్జున టీజర్ ఈవెంట్: చిన్ననాటి స్నేహితుడి కోసం వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న లేడీ డైరెక్టర్! ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా? మతిమరుపు అంతా వయసు వల్లే కాదు స్వాతంత్ర్య పోరాటం ముగిసిన అధ్యాయం కాదు.. భావితరాల పవిత్ర వారసత్వం: చాగంటి కోటేశ్వరరావు కర్బన ఉద్గారాలపై అభివృద్ధి చెందుతున్న దేశాలనే నిందించడం తగదు: ప్రధాని మోదీ త్యాగాల పునాదులపై వచ్చిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకుందాం డిసెంబర్‌లో మూడు జిల్లాల దీనీ ఇజ్‌తిమా-మంత్రి ఎన్ఎండి ఫారూక్‌

మతిమరుపు అంతా వయసు వల్లే కాదు

Select Suryaa Now
మతిమరుపు అంతా వయసు వల్లే కాదు


- అల్జీమర్స్‌ ముప్పు తగ్గించేందుకు జీవనశైలి మార్పులు కీలకం
- రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ నియంత్రణతోపాటు వ్యాయామం అవసరం
- కొత్త విషయాలు నేర్చుకోవడం.. మరో భాష అభ్యసించడమూ మెదడుకు వ్యాయామమే
- మతిమరుపు పెరుగుతుంటే ముందుగానే వైద్యులను సంప్రదించాలి

*- డా. శైలేష్‌ మోదీ*   సీనియర్‌ కన్సల్టెంట్‌ న్యూరాలజిస్ట్‌, 
కిమ్స్‌ హాస్పిటల్స్‌, సీతమ్మధార, విశాఖపట్నం

వయసు పెరిగేకొద్దీ అప్పుడప్పుడు పేర్లు గుర్తురాకపోవడం, వస్తువులు ఎక్కడ పెట్టామో మర్చిపోవడం సాధారణమే. అయితే మతిమరుపు క్రమంగా పెరుగుతూ రోజువారీ పనులపై ప్రభావం చూపుతుంటే దాన్ని వృద్ధాప్య లక్షణంగా కొట్టిపారేయకూడదు. అల్జీమర్స్‌ లేదా ఇతర రకాల డిమెన్షియాకు అది సంకేతం కావచ్చు. సాధారణ వృద్ధాప్యంలో సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ పదేపదే ఒకే ప్రశ్న అడగడం, ఇటీవల జరిగిన విషయాలను మర్చిపోవడం, పరిచయమైన ప్రాంతాల్లో దారి తప్పడం, డబ్బుల లెక్కల్లో పొరపాట్లు చేయడం, మందులు వేసుకున్నామో లేదో గుర్తులేకపోవడం వంటి మార్పులు కనిపిస్తే జాగ్రత్త అవసరం. నిద్రలేమి, డిప్రెషన్‌, థైరాయిడ్‌ సమస్యలు, విటమిన్‌ లోపాలు, కొన్ని మందుల ప్రభావం, వినికిడి సమస్యల వల్ల కూడా జ్ఞాపకశక్తి తగ్గవచ్చు. అందువల్ల వైద్య పరీక్షలు ముఖ్యం.

*మెదడుకు పదవీ విరమణ వద్దు*
ఉద్యోగ విరమణ తర్వాత కుటుంబ సభ్యులు ప్రేమతో పెద్దల బాధ్యతలన్నీ తీసుకుంటారు. బ్యాంకు పనులు, బిల్లులు, ప్రయాణాలు, కొనుగోళ్లు వంటివి వారే చూసుకుంటారు. దీంతో వృద్ధులు నిర్ణయాలు తీసుకోవడం, లెక్కలు చూడటం వంటి పనులకు దూరమవుతారు. ఫలితంగా ప్రారంభమైన జ్ఞాపకశక్తి సమస్యలు ఆలస్యంగా గుర్తించే అవకాశం ఉంది. భద్రతకు ఇబ్బంది లేని వరకు వృద్ధులను కుటుంబ నిర్ణయాల్లో భాగస్వాములను చేయాలి.

*గుండె ఆరోగ్యానికి తీసుకునే జాగ్రత్తలే, మెదడు ఆరోగ్యానికి కూడా తీసుకోవాలి.* 
రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, పొగతాగడం, అధిక మద్యం, వినికిడి–చూపు లోపాలు, సామాజిక ఒంటరితనం, తలకు గాయాలు వంటి అంశాలు డిమెన్షియా ముప్పుతో సంబంధం కలిగి ఉన్నాయి. నడక, సైక్లింగ్‌, ఈత వంటి వ్యాయామాలు చేయాలి. సాధారణంగా వారానికి కనీసం 150 నిమిషాల నుండి 300 నిమిషాల వరకు మితమైన శారీరక శ్రమ అవసరం. వైద్యుల సూచనతో కండరాలను బలపరిచే వ్యాయామాలూ చేయాలి.

*కొత్తది నేర్చుకోవాలి*
సుడోకు, క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌తోపాటు కొత్త విషయాలు నేర్చుకోవడం మెదడును చురుకుగా ఉంచుతుంది. పుస్తకాలు చదవడం, సంగీతం నేర్చుకోవడం, కొత్త సాంకేతికతను ఉపయోగించడం, మరో భాష చదవడం, రాయడం, మాట్లాడడం వంటి కార్యకలాపాలు జ్ఞాపకశక్తి, శ్రద్ధ, ఆలోచనా సామర్థ్యాలను చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే ఇవి అల్జీమర్స్‌ను పూర్తిగా నివారిస్తాయని చెప్పలేం.

*ఆహారంలోనూ జాగ్రత్త*
ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు, గింజలు, చేపలు వంటి పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అధిక ఉప్పు, చక్కెర, వేయించిన పదార్థాలు, బాగా ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. విటమిన్లు, టానిక్‌లు లేదా సప్లిమెంట్లను అల్జీమర్స్‌ నివారణకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు.

*తొలిదశలో గుర్తింపు కీలకం*
మతిమరుపు పెరుగుతూ రోజువారీ పనులకు ఇతరులపై ఆధారపడే పరిస్థితి వస్తే న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. తొలిదశలో గుర్తిస్తే రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ వంటి అంశాలను నియంత్రించడంతోపాటు భవిష్యత్తు సంరక్షణ, ఆర్థిక వ్యవహారాలు, చికిత్సపై ముందుగానే ప్రణాళిక చేసుకోవచ్చు. అల్జీమర్స్‌ చికిత్సలో లెకానెమాబ్‌ వంటి కొత్త యాంటీ-అమైలాయిడ్‌ ఔషధాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎంపికైన ప్రారంభ దశ రోగుల్లో వ్యాధి పురోగతిని కొంత మందగించగలిగినా, ఇవి అందరికీ సరిపోవు. అమైలాయిడ్‌ నిర్ధారణ, ఎంఆర్‌ఐ పర్యవేక్షణ అవసరం. ARIA వంటి దుష్ప్రభావాల కారణంగా నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి. మతిమరుపును వయసు పేరుతో నిర్లక్ష్యం చేయొద్దు. రోజూ నడవండి.. కొత్తవి నేర్చుకోండి.. రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచండి. ముఖ్యంగా జ్ఞాపకశక్తిలో క్రమంగా మార్పులు కనిపిస్తే ముందుగానే వైద్యులను సంప్రదించండి.