నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు
కేజీబీవీలో అర్ధరాత్రి కలకలం..!!
నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు..!!
సీసీ కెమెరాల్లోనూ చిక్కని ఘటన..!!
రంగంలోకి పోలీసులు, బాలల హక్కుల కమిటీ..!!
భీమిలి,సెప్టెంబర్ 19, మేజర్ న్యూస్:
విద్యార్థినుల భద్రతకు పటిష్టమైన ఏర్పాట్లు ఉండాల్సిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. భీమిలి కృష్ణా కాలనీలో ఉన్నటువంటి కేజీబీవీ హాస్టల్‌లో నిద్రిస్తున్న బాలికల జడలను గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరించడంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. ఈ నెల 16వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటనలో మొత్తం 10 మంది బాలికల జడలు కత్తిరించబడినట్లు సమాచారం. 9వ తరగతికి చెందిన 20 మంది విద్యార్థినులు ఒక గదిలో నిద్రిస్తుండగా ఆరుగురి జడలు కత్తిరించారు. మరో గదిలో నిద్రిస్తున్న 18 మంది విద్యార్థినుల్లో నలుగురి జడలు కత్తిరించినట్లు తెలిసింది. తెల్లవారుజామున నిద్రలేచిన విద్యార్థినులు ఈ విషయాన్ని గుర్తించి పాఠశాల ప్రిన్సిపాల్ గంగాకుమారికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాలేదని ప్రిన్సిపాల్ తెలిపినట్లు సమాచారం. దీంతో బాలికల గదుల్లోకి గుర్తుతెలియని వ్యక్తులు ఎలా ప్రవేశించారు? ఘటన ఎలా జరిగింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విషయం వెలుగులోకి రావడంతో జిల్లా బాలల అభివృద్ధి అధికారి శ్రీదేవి, భీమిలి ఎస్‌ఐ గౌరీ వేర్వేరుగా విచారణ చేపట్టారు. విద్యార్థినులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. పోలీసులు, బాలల హక్కుల కమిటీ కూడా విచారణ కొనసాగిస్తున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను తెలుసుకునేందుకు ఆదివారం తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థినులను విచారించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. విద్యార్థినుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.