గాజుల గణపతి ముసుగులో రాక్షస దందా.. జీవీఎంసీ 'జోన్-6'కి కమీషన్ల కక్కుర్తి!
*కేఎన్ఆర్ అండ్ కో, గణేష్ అక్రమాలకు వంతపాడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు*
*పండుగ ముసుగులో నిలువు దోపిడీ.. బలైపోతున్నది పేద వ్యాపారులే!*
*ఇంత జరుగుతున్నా మౌనమేల?.. అసలు జీవీఎంసీ కమిషనర్ ఉన్నారా? లేరా?*
*గాజువాక, సెప్టెంబర్ 19, మేజర్ న్యూస్ :* దేవుడిపై ఉన్న భక్తిని పెట్టుబడిగా మార్చుకుని, 'గాజుల గణపతి' కేంద్రంగా సాగుతున్న భారీ కమర్షియల్ దందాకు పోలీసులు గట్టి చెక్ పెట్టినా.. జీవీఎంసీ జోన్-6 టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు మాత్రం ఇంకా అనుమానాస్పదంగానే మిగిలింది. పండుగ పేరుతో అమాయక చిరువ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడిన నిర్వాహకులు కేఎన్ఆర్ అండ్ కో, గణేష్ లాంటి వారికి అడ్డుకట్ట వేయడంలో జీవీఎంసీ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో అనధికార స్టాళ్లను జేసీబీలతో నేలమట్టం చేసినప్పటికీ.. వసూళ్ల పర్వానికి కేంద్ర బిందువైన 'యమలోకం', 'డైనోసార్' సెట్లను మాత్రం జోన్-6 అధికారులు ఇంకా చూసీచూడనట్లు వదిలేయడం వారి అవినీతికి అద్దం పడుతోంది. దందా మొదట్లోనే అధికారులు కఠినంగా వ్యవహరించి ఉంటే.. బతుకుదెరువు కోసం ఎక్కడి నుంచో వచ్చిన సామాన్యులు ఇలా మోసపోయి రోడ్డున పడేవారు కాదు.
*వీకెండ్ వసూళ్ల కోసమేనా ఈ గడువు?*
నిబంధనలకు విరుద్ధంగా వెలసిన ఆ సెట్లను తక్షణమే తొలగించాల్సిన జీవీఎంసీ జోన్-6 అధికారులు.. ఏకంగా ఆదివారం వరకు గడువు ఇవ్వడం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. శని, ఆదివారాల్లో పండుగ రద్దీ అత్యధికంగా ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని కేఎన్ఆర్ అండ్ కో, గణేష్ వంటి అక్రమార్కులకు ఫేవర్ చేసేందుకే.. ఈ రెండు రోజులు క్రౌడ్ నుంచి డబ్బులు వసూలు చేసుకోండనే ఉద్దేశంతోనే అధికారులు ఈ గడువు ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అసలు ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేని పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇంత పెద్దఎత్తున చర్యలు తీసుకుంటే, క్షేత్రస్థాయిలో బాధ్యత వహించాల్సిన జీవీఎంసీ జోన్-6 మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. ఏదైనా జరగరాని పెద్ద సంఘటన జరిగితేనే ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందిస్తారా? అప్పటివరకు మౌనం పాటిస్తారా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
*కలచివేస్తున్న చిరువ్యాపారి కన్నీటి గాథ..*
దేవుడి పేరుతో ఈ అక్రమార్కులు సాగించిన వసూళ్ల పర్వానికి, జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి ఈ వీడియోనే సజీవ సాక్ష్యం. అనపర్తి ప్రాంతం నుంచి వచ్చిన ఓ చిరువ్యాపారి కన్నీటి గాథ అందరినీ కలచివేస్తోంది. పండుగ పూట నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని ఆశపడి వస్తే.. రూ. 25 వేలు అడ్వాన్స్ కట్టించుకుని గణేష్ తదితర నిర్వాహకులు తనను నిలువునా ముంచేశారని సదరు వ్యాపారి కన్నీరుమున్నీరవుతున్నాడు. కనీసం బోణీ కూడా కొట్టకుండానే, ఎలాంటి వ్యాపారం జరగకుండానే అర్ధాంతరంగా పోలీసులు, అధికారులు దుకాణాలను తొలగించడంతో.. ఇప్పుడు తెచ్చుకున్న సరుకును, పెట్టుబడిని కోల్పోయి తీవ్ర నష్టాలతో వెనుతిరగాల్సిన దుస్థితి నెలకొంది. దేవుడి సన్నిధిలో స్టాల్స్ ఏర్పాటుకు ఒక్కొక్కరూ రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు అడ్వాన్సులు ఇచ్చి ఇప్పుడు లబోదిబోమంటున్న 21 స్టాళ్లకు సంబంధించిన బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
*అధికారులకు తీరిక లేదు.. బలైపోతున్నది పేద వ్యాపారులే!*
గాజువాకలో గాజుల గణపతి పవిత్రతను అడ్డం పెట్టుకుని ఇంత పెద్ద ఎత్తున అనధికారికంగా సెట్లు వేసి బహిరంగంగా నిలువు దోపిడీకి పాల్పడుతుంటే.. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు, తీరిక లేనట్లు వ్యవహరిస్తుండటం దారుణం. వారి ఈ నిర్లక్ష్య వైఖరికి ఒకవైపు అమాయక ప్రజలు, మరోవైపు బతుకుదెరువు కోసం వచ్చిన పేద వ్యాపారులు బలైపోతున్నారు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో జీవీఎంసీ కమిషనర్ ఎందుకు ఉన్నారో, ఆయన పాత్ర ఏమిటో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి నగరంలో నెలకొంది. రేపటితో ఈ అక్రమ సెట్లకు ఇచ్చిన గడువు ముగుస్తున్న నేపథ్యంలో.. సోమవారం నాటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి జోన్-6 అధికారులపైన, అక్రమార్కులైన కేఎన్ఆర్ అండ్ కో, గణేష్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో దేవుడి పేరుతో ఇలాంటి వ్యాపారాలు జరగకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.