ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే ఏపీ విద్యావ్యవస్థ దేశంలోనే నెం.1
ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే ఏపీ విద్యావ్యవస్థ దేశం లోనే నెంబర్ 1
క్లాస్‌రూమ్ నుంచే సమాజంలో మార్పు సాధ్యం.. విద్యాశాఖను ఎంచుకున్నా
సాంకేతికతకు భారతీయ విలువలు జోడిస్తే ప్రపంచ విజేతలుగా ఎదుగుతాం
త్యాగధనుల స్ఫూర్తితో దేశభక్తిని పెంపొందించాలి
చిన్నచిన్న సమస్యలకు కుంగిపోకుండా ఎదురొడ్డి పోరాడాలి
తల్లిదండ్రులు, దేశం గర్వపడేలా విద్యార్థులు ఎదగాలి
ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
సూర్య, స్టేట్ బ్యూరో :
ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ దేశంలోనే నెం.1గా నిలుస్తుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్పు తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ఇంటర్‌లోనూ 10 వేల అడ్మిషన్లు పెరిగాయని వెల్లడించారు. కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో పాఠశాల విద్యాశాఖ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారతీయం’ దేశభక్తి కార్యక్రమానికి లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, నైతిక విలువలు మన బలమన్నారు. మానవత్వం భారతీయుల వారసత్వమని, నైతిక విలువలే కుటుంబ వ్యవస్థకు పునాది అని పేర్కొన్నారు. పురాతన కాలంలోనే వైద్యంలో చరకుడు, రాజనీతిలో చాణక్యుడు, గణితంలో ఆర్యభట్ట, యోగాలో పతంజలి, ఆయుర్వేదంలో ధన్వంతరి తమ ప్రతిభను ప్రపంచానికి చాటారని గుర్తుచేశారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులను గౌరవంగా చూడటానికి కారణం మన పెద్దలు అందించిన విలువలేనన్నారు. ‘యూనిటీ ఇన్ డైవర్సిటీ’ భారతదేశ బలమని, ఈ గొప్ప వారసత్వాన్ని కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. అందుకే విద్యలో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నైతిక విలువలు అనగానే గుర్తొచ్చే పేరు చాగంటి కోటేశ్వరరావు అని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను నైతిక విలువల సలహాదారుగా నియమించారని చెప్పారు. ఆయన రూపొందించిన పుస్తకాలను విద్యార్థులకు అందిస్తున్నామని, చిన్నతనం నుంచే పెద్దలను, మహిళలను గౌరవించడం, గెలుపోటములను సమానంగా స్వీకరించడం నేర్పిస్తున్నామని తెలిపారు. ఆరేళ్లలోపు పిల్లల్లో మెదడు అభివృద్ధి ఎక్కువగా జరుగుతుందని, ఆ దశ నుంచే చదువుతోపాటు ఆటలు, నైతిక విలువలు నేర్పించాలని సూచించారు. సమాజంలో మార్పు విద్య ద్వారానే సాధ్యమని నమ్మి తాను విద్యాశాఖను ఎంచుకున్నానని లోకేష్ తెలిపారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం విద్యార్థి కేంద్రంగా ఉండాలన్నారు. క్లాస్‌రూమ్ నుంచే సమాజంలో మార్పు ప్రారంభమవుతుందని చెప్పారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు విధ్వంసానికి దారితీస్తాయని హెచ్చరించారు. తాను అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌లో చదువుకున్నప్పుడు రెండేళ్ల ఎంబీఏ పరీక్షల్లో ఇన్విజిలేటర్లను చూడలేదని, అలాంటి క్రమశిక్షణ మన విద్యావ్యవస్థలోనూ రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా రెండేళ్లలో అనేక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. తాను విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘నో పాలిటిక్స్ ఇన్ స్కూల్స్’ నిర్ణయం తీసుకున్నానని, యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు, షూస్‌లో రాజకీయ పార్టీల రంగులు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎక్కడా ముఖ్యమంత్రి లేదా తన ఫొటోలను ముద్రించలేదన్నారు. సాంకేతికతకు భారతీయ నైతిక విలువలు జోడించాలని, ఏది మంచి, ఏది చెడు అనే ఆలోచనా శక్తిని పిల్లల్లో పెంపొందించడమే విలువల విద్య లక్ష్యమని చెప్పారు. ఏఐ, రోబోటిక్స్ వంటి సాంకేతిక రంగాల్లో ముందుకు సాగుతున్న తరుణంలో వాటికి భారతీయ విలువలు తోడైతే ప్రపంచ విజేతలుగా ఎదగగలమన్నారు. ‘అమ్మకు చెప్పలేని పని చేయొద్దు’ అనే చాగంటి కోటేశ్వరరావు మాటను ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలని సూచించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని లోకేష్ పిలుపునిచ్చారు. దేశభక్తి, గుండె ధైర్యానికి ప్రతిరూపంగా టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు సేవలను గుర్తుచేశారు. సినిమాల్లో కనిపించే వారిని హీరోలుగా భావించకుండా దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి కాపలా కాసే సైనికులే నిజమైన హీరోలని అన్నారు. కార్గిల్ యుద్ధ వీరుడు డి.కిరణ్‌కుమార్ దేశం కోసం చూపిన ధైర్యాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్‌లో ప్రాణత్యాగం చేసిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని తాను కలిసి మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల త్యాగాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విజయానికి ఎలాంటి షార్ట్‌కట్ లేదని, కష్టపడి పనిచేస్తేనే ఉన్నత స్థానాలకు చేరుకోగలమన్నారు. 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నిరాశ చెందకుండా ఐదేళ్లు ప్రజలకు దగ్గరగా పనిచేశానని, 2024లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించానని తెలిపారు. తాను పడిపోయిన చోటే నిలబడి విజయం సాధించానని చెప్పారు. విద్యార్థులు కూడా సమస్యలకు భయపడకుండా ఎదురొడ్డి పోరాడాలని సూచించారు. ఇటీవల ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తనను తీవ్రంగా బాధించిందని తెలిపారు. చిన్నచిన్న సమస్యలకు కుంగిపోయి ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఇంట్లో చెప్పుకోలేని సమస్యలు ఉంటే ఉపాధ్యాయులకు చెప్పాలని, వారు అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లలను చదివిస్తున్నారని, వారు తలదించుకునేలా కాకుండా తలెత్తుకునేలా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. తమకు నచ్చిన రంగంలో కష్టపడి ముందుకు సాగాలని, చదువు, క్రీడలు, కళలు ఏ రంగమైనా ప్రతిభ చూపాలని పిలుపునిచ్చారు. దేశభక్తి, దైవభక్తి, పెద్దల పట్ల గౌరవం, మహిళల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత వంటి విలువలను అలవర్చుకుంటే విద్యార్థులు విజేతలుగా ఎదుగుతారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్న వికసిత్ భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్న స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తామో భారతదేశాన్ని కూడా అంతే ప్రేమించాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.