ప్రపంచ ఉగ్రవాది మసూద్ అజార్ కోసం పాకిస్తాన్ బూటకపు వేట
న్యూఢిల్లీ: జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత, కుప్రసిద్ధ ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్‌ను పట్టుకోవడానికి పాకిస్తాన్ మరోసారి బూటకపు నాటకానికి తెరతీసింది. పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) విడుదల చేసిన తాజా "రెడ్ బుక్" మోస్ట్ వాంటెడ్ జాబితాలో అజార్‌ను 1,480వ స్థానంలో చేర్చడమే కాకుండా, అతని సమాచారం అందించిన వారికి ఇచ్చే పారితోషికాన్ని 70 లక్షల పాకిస్తానీ రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. లాహోర్, ముల్తాన్, గుజ్రాన్‌వాలాలలో అతనిపై క్రిమినల్ వారెంట్లు ఉన్నట్లు పేర్కొంది.
ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) కీలక సమీక్షకు ముందే పాకిస్తాన్ ఈ వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది. అంతర్జాతీయ ఉగ్రవాద నిధుల నిరోధక నిబంధనలకు తాము కట్టుబడి ఉన్నామని చూపిస్తూ, ఆర్థిక ఆంక్షలకు దారితీసే FATF 'గ్రే లిస్ట్'లోకి తిరిగి జారిపోకుండా తప్పించుకోవడానికే ఇస్లామాబాద్ ఈ జిమ్మిక్కులు చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పాకిస్తాన్ చర్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇటువంటి బూటకపు ప్రకటనలు, డొల్ల జిమ్మిక్కులు కొత్తేమీ కాదని, సరిహద్దు ఉగ్రవాదంపై పాకిస్తాన్ మాటలు చెప్పడం మానేసి నిజమైన చర్యలు తీసుకోవాలని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ జనరల్ డి.పి. పాండే (రిటైర్డ్) కూడా స్పందిస్తూ, FATF ఒత్తిడి ఎదురైనప్పుడల్లా పాకిస్తాన్ ప్రపంచాన్ని మభ్యపెట్టడానికి ఇలాంటి నాటకాలు ఆడుతుందని విమర్శించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మే 2019లోనే అజార్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించగా, అమెరికా అతనిపై 10 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. 1999 డిసెంబర్‌లో కాందహార్ బందీల మార్పిడిలో విడుదలైన అజార్, ఆ తర్వాత జైష్-ఎ-మొహమ్మద్ సంస్థను స్థాపించాడు. అప్పటి నుండి 2000లో కాశ్మీర్ సైనిక స్థావరంపై దాడి, 2001లో అసెంబ్లీ మరియు పార్లమెంటుపై దాడులు, 2016లో పఠాన్‌కోట్, ఊరీ దాడులు మరియు 2019లో 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది అమరులైన పుల్వామా కాన్వాయ్ బాంబు దాడి వరకు భారతదేశంలో జరిగిన పలు ప్రధాన ఉగ్రదాడుల వెనుక అజార్ హస్తం ఉంది.
బహవల్పూర్‌లోని జైష్ ప్రధాన కార్యాలయం మార్కజ్ సుభాన్ అల్లా నుండి అజార్ స్వేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. 2015 మేలో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత బలగాలు జరిపిన ప్రతీకార దాడి నుండి అజార్ తృటిలో తప్పించుకోగా, అతని 10 మంది అనుచరులు హతమయ్యారు. తమ భూభాగంలోనే స్వేచ్ఛగా తిరుగుతున్న ఉగ్రవాదిపై పాకిస్తాన్ ఇప్పుడు "వేట" పేరిట నాటకాలు ఆడటం గమనార్హం.