కేజీబీవీ ఘటనలో బాధ్యులను గుర్తిస్తాం: గంటా
సూర్య కథనానికి స్పందన
భీమిలి, సెప్టెంబర్ 20, మేజర్ న్యూస్:
కేజీబీవీ హైస్కూల్ లో నిద్రపోతున్న విద్యార్ధినుల జుట్టు కత్తిరించిన ఘటనలో బాధ్యులని గుర్తిస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం కేజీబీవీని సందర్శించిన ఆయన సంఘటన గురించి పాఠశాల విద్యార్ధినులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆరా తీశారు. పగడ్బందీ భద్రత ఉన్నందున బయట నుంచి ఎవరూ వచ్చే అవకాశం లేదని.. పాఠశాలలో ఉన్న వారే ఈ చర్యకు పాల్పడి ఉంటారనే ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. 4 రోజుల క్రితం చోటు చేసుకున్న విషయానికి ఇప్పుడు విస్తృత ప్రచారం కల్పించడం వెనుక ఎవరైనా ఉన్నారా అనే అంశాన్ని విచారిస్తున్నారు. సునిశితమైన విషయం కావడంతో విద్యార్థినులతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిష్టాకరమైన విద్యా సంస్థలో ఇలాంటి సంఘటనలు సహించబోమని.. పాఠశాల విద్యార్థినులతో మాట్లాడి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. పిల్లలు ఆకతాయితనంగా చేశారా లేదా వేరే బలమైన కారణముందా అనేది విచారణలో తేలుతుందని తెలిపారు. కారకులు ఎవరు అనేది స్వచ్ఛందంగా చెబితే సమస్య కొలిక్కి వస్తుందని లేనిపక్షంలో సీసీ కెమెరాలు, వేలి ముద్రలు వంటి సాక్ష్యాల ఆధారంగా బాధ్యులని గుర్తిస్తామన్నారు. ఏపీసీ చంద్రశేఖర్, ప్రిన్సిపాల్ గంగాభవాని, సీఐ దివాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.