భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలి
నాగర్‌కర్నూల్ కలెక్టర్
నాగర్‌కర్నూల్: జిల్లా ప్రజలందరూ వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్న వినాశకుడైన శ్రీ గణనాథుని కృపాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో వికసించాలని ఆయన ఆకాంక్షించారు.
మండపాల నిర్వహణలో, పూజల్లో పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి పూజించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేవుడిపై భక్తితో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పేర్కొన్నారు.