నాగర్‌కర్నూల్‌లో ‘మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ’ కార్యాలయం ప్రారంభం
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి రోడ్, సబ్ జైలు ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ‘మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ’ కార్యాలయాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. కార్యాలయ భవనంపై జెండాను శ్రీ బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు చింతలగారి వెంకటస్వామితో పాటు సిద్ధేశ్వర్ పటేల్ మరియు వారి కమిటీ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సిద్ధేశ్వర్ పటేల్ మాట్లాడుతూ.. బహుజనులకు రాజ్యాధికారం దక్కకుండా అగ్రవర్ణాలు రాజకీయ కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. బహుజనులంతా ఏకమై ‘ఓట్లు మనవి - సీట్లు మనవి’ అనే నినాదంతో ముందుకు సాగాలని, 12 బహుజన కులాల కూటమితో పోరాడి రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకుని నియామక పత్రాలను అందజేశారు. జిల్లా అధ్యక్షురాలిగా వరద్ స్వర్ణలత, ఉపాధ్యక్షురాలిగా నిరడి అంజలి, ప్రధాన కార్యదర్శిగా ఏటిగడ్డ శ్రీనివాసులు, కోశాధికారిగా వారధి నరేందర్, జాయింట్ సెక్రటరీగా జంగిటి సైదులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో తీగేల భాస్కర్, పొడుగు రాఘవులు, జాజుల బాలరాజ్, పాలమూరు శంకరయ్య, అల్లిపురం కృష్ణయ్య తదితర నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.