క్యూర్ పరిధిలో 21వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి ఈనెలాఖరులోగా లబ్దిదారుల ఎంపిక పూర్తిచేయాలి దాదాపు 9వేల మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణ బ్యూరో, ప్రతినిధి : గత ప్రభుత్వం మొండిగోడలతో అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు పూర్తి చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆనాటి ప్రభుత్వం ప్రారంభించి వదిలేసిన ఇళ్లను మేమెందుకు పూర్తిచేయాలన్న భేషజాలకు పోకుండా ఒక్క క్యూర్ పరిధిలోని 26 ప్రాంతాల్లో 21వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తిచేశామని ప్రకటించారు. శనివారం నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయం నుంచి రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, వాటర్ వర్క్స్ , విద్యుత్ అధికారులతో హౌసింగ్ సెక్రటరీ విపి గౌతమ్‌తో కలిసి మంత్రిగారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పూర్తి చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఈనెల 30వ తేదీలోగా యుద్ధప్రాతిపదికన పారదర్శకంగా డ్రా పద్దతిలో లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి ఆన్‌లైన్ పోర్టల్‌లో లబ్దిదారుల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. 2బిహెచ్‌కే ఇళ్లు ఉన్న ప్రాంతానికి 5నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో ఉన్నవారినే ఎంపిక చేయాలని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీలలో తాగునీరు, విద్యుత్, పారిశుధ్య సదుపాయాలపై ప్రత్యేకదృష్టి సారించాలని వాటర్ వర్క్స్ , ఆర్ డబ్ల్యూఎస్ , విద్యుత్ తదితర శాఖలతో సమన్వయం చేసుకొని వచ్చేనెలాఖరు లోగా మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఉన్న అనర్హులను తొలగించాలని, ఆ ఇళ్లలో నివసించని వారికి ఫైనల్ నోటీస్ ఇచ్చి రద్దు చేయాలని , అంతేగాక నోటీసులకు స్పందించని వారి ఇళ్లను రద్దుచేసి వారి స్ధానంలో అర్హులైన వారిని ఎంపిక చేయాలని కలెక్టర్లకు సూచించారు. క్యూర్ పరిధిలో ఇంటిస్ధలాలు ఉండి అర్హులైన దాదాపు 9వేల మందికి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇన్‌ఛార్జి మంత్రులు , స్ధానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని ఇందిరమ్మ ఇళ్లకు లబ్దిదారుల ఎంపిక, మంజూరు పత్రాలను అందజేయాలని అధికారులకు సూచించారు.