జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎంపీ చామల సంచలన ఆరోపణలు కేటీఆర్‌కు చెందిన భూములపై ఈడీ, ఐటీ కేసులు .. ఉండగానే బదలాయింపులు ఎలా జరిగాయి?: ఫిరంగి నాలా ఆక్రమణతోనే ఫామ్‌హౌస్ నిర్మాణం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఎంపీ ఆరోపణ
తెలంగాణ బ్యూరో ప్రతినిధిః జన్వాడలోని భూములు, ఫామ్‌హౌస్ వ్యవహారంపై భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. జన్వాడ భూముల అంశంపై హైడ్రా కమిషనర్, మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడినట్లు తెలిపారు. ప్రైవేటు భూముల్లోకి వెళ్లాలనే ఉద్దేశం తమకు లేదని, గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం అధికారాన్ని దుర్వినియోగం చేసిందనే విషయాలను ప్రజలకు వివరించేందుకే వచ్చామని చెప్పారు.
జన్వాడలోని భూములకు సంబంధించి సత్యం రామలింగరాజుకు చెందిన శతభిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరును ప్రస్తావించిన చామల.. ఆ కంపెనీకి సంబంధించిన భూముల బదలాయింపులపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. 301, 311, 313 సర్వే నంబర్లలోని భూములు ఇతరుల పేర్లకు, అనంతరం డీఎన్‌బీ అనే కంపెనీకి బదలాయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో డి.రాజేష్ అనే వ్యక్తి పాత్రపై కూడా ప్రశ్నలు సంధించారు. ఈడీ, ఐటీ కేసులు ఉన్న సమయంలోనే 13 ఎకరాల భూములను ఎలా విడుదల చేశారని చామల ప్రశ్నించారు. ఆ భూములు ప్రదీప్ రెడ్డి పేరుకు ఎలా బదలాయించబడ్డాయో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ, ఈడీ ఈ అంశంపై హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు. జన్వాడ ఫామ్‌హౌస్ ఫిరంగి నాలాను ఆక్రమించి నిర్మించారని, 111 జీవో పరిధిలో ఉన్నప్పటికీ నిర్మాణానికి అనుమతులు తీసుకోలేదని చామల ఆరోపించారు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నాళా ఆక్రమణకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫామ్‌హౌస్‌లో ఎలా ఉన్నారని ప్రశ్నించారు. ప్రదీప్ రెడ్డికి జూలైలోనే హైడ్రా నోటీసులు ఇచ్చిందని తెలిపారు. 301 సర్వే నంబర్‌లో 3 ఎకరాల 2 గుంటల భూమి కేటీఆర్ సతీమణి శైలిమ పేరుతో, మరో 18 గుంటల భూమి కేటీఆర్ అత్త పాకాల శశిరేఖ పేరుతో ఉందని చామల పేర్కొన్నారు. ఈ భూములు గతంలో సత్యం రామలింగరాజుకు చెందిన కంపెనీ భూములేనని ఆయన ఆరోపించారు. ఐటీ ట్రిబ్యునల్‌లో కేసు కొనసాగుతున్న సమయంలోనే భూముల బదలాయింపు ఎలా జరిగిందని ప్రశ్నించారు. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రదీప్ రెడ్డిపై డ్రోన్ కేసు పెట్టి జైలుకు పంపారని చామల గుర్తుచేశారు. కేటీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉన్నారని ప్రదీప్ రెడ్డి ఫిర్యాదు చేశారని తెలిపారు. కేటీఆర్, ప్రదీప్ రెడ్డి మధ్య ఎలాంటి అగ్రిమెంట్ లేదని కూడా పేర్కొన్నారు. నిన్న హరీశ్‌రావు వ్యవహారంపై, ఇవాళ కేటీఆర్ వ్యవహారంపై ప్రజలకు వివరించామని చామల అన్నారు. హరీశ్‌రావు ఇరిగేషన్ భూముల్లో ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ 300 ఎకరాల్లో ఉందని పేర్కొన్నారు. కాగా, సూర్యాపేటలో కమ్యూనిస్టు మాజీ ఎమ్మెల్యే కుటుంబం ఇటీవల ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుందని చామల ప్రస్తావించారు. అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ కుటుంబం చేసినట్లు తాము ఆరోపిస్తున్న భూ వ్యవహారాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు.