పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించాలి: జిల్లా వ్యవసాయ అధికారి ఉల్లోజు వినోద్‌కుమార్
మునుగోడు,మేజర్ న్యూస్:
పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించాలనీ జిల్లా వ్యవసాయ అధికారి ఉల్లోజు వినోద్‌కుమార్ అన్నారు.శనివారం మండలంలోని పులిపల్పుల క్లస్టర్ పరిధిలోని సింగారం, ఊకోండి మరియు కొంపల్లి గ్రామాల్లోని పంట పొలాలను సందర్శించి, ప్రస్తుతం పంటల పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగులో అవలంబిస్తున్న పద్ధతులపై రైతులను అడిగి తెలుసుకున్నారు. వానాకాలంలో సాగు చేస్తున్న పత్తి పంట పొలాలను రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పత్తి పంటలో ప్రస్తుత దశలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. పంటలను ఒకే విధంగా సాగు చేయకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంబించడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తులో పంటల దిగుబడిని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. పంటను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తెగుళ్లు, పురుగుల ఉధృతి గుర్తించిన వెంటనే వ్యవసాయ అధికారుల సూచనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.అదేవిధంగా డిజిటల్ క్రాప్ సర్వే (డిసిఎస్ )లో భాగంగా ప్రతి గ్రామంలో వాలంటీర్లు రైతులు సాగు చేసిన పంటలను ఫోటో క్యాప్చర్ చేసి, పంటల వివరాలను నమోదు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు రకాల సన్న వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించిన నేపథ్యంలో సన్న వరి సాగు చేస్తున్న రైతులు గ్రామ వాలంటీర్లకు సహకరించి తమ పంట వివరాలను నమోదు చేయించుకోవాలని కోరారు.
రైతులు సన్న వరి ధాన్యాన్ని విక్రయించే సమయంలో తాము కొనుగోలు చేసిన షాపుల్లో కూడా పంట వివరాల ఎంట్రీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో రైతులు సన్న వరి ధాన్యం సాగు వైపు దృష్టి సారించాలని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ క్షేత్ర సందర్శనలో వ్యవసాయ విస్తరణ అధికారులు మాధగోని నరసింహగౌడ్, నిఖిల్‌కుమార్, అభిలాష్, రైతులు కారింగు సత్తయ్య, వట్టి అంజిరెడ్డి, సరికొండ సైదులు, రావుల నరసింహ, రాంబాబు, కవిత, ఉప్పనూతల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.