జర్నలిస్టుల పిల్లల ఫీజులపై జాప్యం.. ఇక సహించం!… తక్షణమే ఆదేశాలు జారీ చేయాలి.. లేదంటే దశలవారీ ఉద్యమం… పెద్దపల్లి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్…
సూర్య పెద్దపల్లి ప్రతినిధి:
జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన అంశాల పరిష్కారంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శించడం బాధాకరమని పెద్దపల్లి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ అన్నారు. సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలంటూ జర్నలిస్టు సంఘాల నాయకులు, పెద్దపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కలెక్టర్ కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో అమలు చేయాల్సిన ఫీజు రాయితీపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంలో జరుగుతున్న జాప్యంతో వందలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.
జిల్లాలో సుమారు 500 మంది జర్నలిస్టు కుటుంబాల విద్యార్థులు ఫీజు రాయితీ కోసం ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం మొదటి బిడ్డకు 100 శాతం, రెండో బిడ్డకు 50 శాతం రాయితీ లభించాల్సి ఉందన్నారు. అయితే జిల్లా స్థాయిలో ఆదేశాలు వెలువడకపోవడంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పూర్తి ఫీజు చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయని పేర్కొన్నారు.పరీక్షల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఫీజు రాయితీ అమలుకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే విజయరమణారావు, డీసీసీ అధ్యక్షుడు మక్కాన్‌సింగ్ చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఇళ్ల స్థలాల అంశాన్నీ పరిష్కరించాలి
జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల సమస్యను కూడా అధికారులు వెంటనే పరిష్కరించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులకు స్థలాలు అందేలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
జర్నలిస్టుల సమస్యలపై ఇకనైనా అధికారులు స్పందించకపోతే జిల్లాలోని జర్నలిస్టులను ఏకతాటిపైకి తీసుకువచ్చి దశలవారీగా ఆందోళనలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు ప్రెస్ క్లబ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.