పోలీస్ వెల్ఫేర్ సంఘం నూతన కమిటీకి జిల్లా ఎస్పీ ఘన సన్మానం
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ వెల్ఫేర్ సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కమిటీ సభ్యులను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జి. పాటిల్ ఘనంగా సన్మానించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నూతన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోలీస్ వెల్ఫేర్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా హెడ్ కానిస్టేబుల్ చిన్ను నాయక్, ఉపాధ్యక్షులుగా నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి, తాడూర్ ఎస్సై రాములు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సిబ్బంది సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా నూతన కమిటీ పనిచేయాలని సూచించారు. పోలీస్ శాఖలోని ప్రతీ ఒక్కరికీ న్యాయం జరిగేలా అందరినీ కలుపుకొని సహోదర భావంతో ముందుకు సాగాలని కోరారు. నాగర్‌కర్నూల్ పోలీస్ వెల్ఫేర్ సంఘానికి రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు వచ్చేలా బాధ్యతాయుతంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.