అట్టముక్కల వైద్యం....!
ముఖ్యమంత్రి జిల్లాలో ఇదేం దుస్థితి....?
పరిగి 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలకు కొరవడిన సౌకర్యాలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ :ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 50 పడకల ఆసుపత్రిగా ఉన్నప్పటికీ అత్యవసర వైద్య సేవలకు అవసరమైన కనీస పరికరాలు అందుబాటులో లేవని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు.
ప్రమాదాల్లో కాళ్లు, చేతులు విరిగిన క్షతగాత్రులకు ఫ్రాక్చర్ స్ప్లింట్లు, పీఓపీ స్లాబ్‌లు, క్రేప్ బ్యాండేజీలు వంటి వైద్య సామగ్రితో చికిత్స అందించాల్సి ఉండగా, అట్టముక్కలను ఉపయోగించి కట్లు కడుతున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎముకలు విరిగిన రోగులకు ప్రథమ చికిత్స చేసి, అనంతరం ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయడమే పరిపాటిగా మారిందని పలువురు వాపోతున్నారు.
అత్యవసర పరికరాలు ఎక్కడ?
అత్యవసర విభాగంలో ఫ్రాక్చర్ స్ప్లింట్లు, పీఓపీ స్లాబ్‌లు, క్రేప్ బ్యాండేజీలు, అల్యూమినియం లేదా ఫైబర్ స్ప్లింట్లు, కార్డ్‌బోర్డ్ మెడికల్ స్ప్లింట్లు వంటి పరికరాలు అందుబాటులో ఉండాల్సి ఉన్నప్పటికీ, వాటి కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలు, సామాన్యులు ఆధారపడే ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం దారుణమని అంటున్నారు. చిన్నపాటి అత్యవసర చికిత్సకు కూడా ఇతర ఆసుపత్రులకు వెళ్లాల్సి రావడంతో రోగులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టి, అత్యవసర వైద్య పరికరాలు, మందులు, అవసరమైన సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందేలా ఆసుపత్రిలో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.