ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్*
ప్రజల హక్కుల పరిరక్షణ, పారదర్శకత, జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టాన్ని మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యవర్గం నిర్ణయించింది.
కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం బి.యన్ రెడ్డి లోని ద్వారకా కన్వెన్షన్ లో హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతంగా అయ్యింది. జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంస్థ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, జిల్లాల వారీగా ప్రజా సమస్యలపై కార్యాచరణ, సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా వివిధ జిల్లాల ప్రతినిధులు తమ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు, అధికారుల నిర్లక్ష్యం, అవినీతి, అక్రమాలు తదితర అంశాలపై చర్చ జరిగింది.
ప్రజా సమస్యలను కేవలం ప్రస్తావించడం కాకుండా, సమస్యలకు సంబంధించిన ఆధారాలను సేకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అవసరమైన సందర్భాల్లో అధికారిక ప్రాతినిధ్యాలు, ఫిర్యాదులు చేయడం, చట్టపరమైన మార్గాలను అనుసరించడం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
అలాగే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కమిటీ కార్యకలాపాలను విస్తరించి, మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ప్రజలకు సమాచార హక్కుపై అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ పాలనలో పారదర్శకత మరియు జవాబుదారీతనం పెంపొందించేందుకు సమిష్టిగా పనిచేయాలని సమావేశం పిలుపునిచ్చింది.
సమావేశాన్ని విజయవంతం చేసిన జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి బాధ్యులు, సభ్యులందరికీ జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, జాతీయ ఉపాధ్యక్షులు గోపీనాథ్ కట్టెకోలా,జాతీయ సహాయ కార్యదర్శి అన్నవరం సందీప్ రెడ్డి,వంగల వివేకానందు,రాష్ట్ర కార్యదర్శి రావుల నవీన్ కుమార్,వేణు గోపాల్,రాష్ట్ర సహాయ కార్యదర్శులు శ్రీకాంత్ రెడ్డి, అశోక్ కుమార్, కాశి సతీష్ కుమార్,గడప కృష్ణ, అరవింద స్వామి, కార్తీక్ రెడ్డి,బాపయ్య,విజయ్ రామ్ సింగ్,వంశీ కృష్ణ,రఘు,రమేష్, 33 జిల్లాల ఆర్టీఐ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.