పొలాలకు వెళ్లని వ్యవసాయ అధికారులు! రైతులకు అందని శాస్త్రీయ సాగు సూచనలు..
పొలాలకు వెళ్లని వ్యవసాయ అధికారులు!
రైతులకు అందని శాస్త్రీయ సాగు సూచనలు..
కాగితాలకే పరిమితమైన క్షేత్రస్థాయి పర్యటనలు
సంగారెడ్డి / కొండాపూర్….దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలవాల్సిన వ్యవసాయ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండాపూర్ మండలంలో ఐదుగురు వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు), ఒక వ్యవసాయాధికారి ఉన్నప్పటికీ రైతుల పొలాల వద్ద క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు అందని శాస్త్రీయ పరిజ్ఞానం.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవసాయ అధికారులు రైతుల పంటలను పరిశీలిస్తూ ఆధునిక సాగు పద్ధతులు, ఎరువుల వినియోగం, పంటల సాగు సమయం, మట్టి పరీక్షలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. గ్రామాల్లోని రైతుల పొలాలను ప్రతిరోజూ పరిశీలించి సూచనలు అందించాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతు వేదికల్లోనూ కనిపించని వివరాలు.
రైతు వేదికల వద్ద క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన పట్టికలు, రైతుల సమస్యల నమోదు రిజిస్టర్లు, పంటల పరిశీలన వివరాలు అందుబాటులో లేవని తెలుస్తోంది. దీంతో రైతులకు అధికారులు అందిస్తున్న సేవలపై స్పష్టత లేకుండా పోతోందని విమర్శలు వస్తున్నాయి.
ఉన్నతాధికారులు తనిఖీలు చేయాలి.
వ్యవసాయ అధికారులు ప్రతిరోజూ విధులకు హాజరవుతున్నారా? గ్రామాల్లోని రైతుల పొలాలను పరిశీలిస్తున్నారా? రైతు వేదికల్లో రిజిస్టర్లు నిర్వహిస్తున్నారా? అనే అంశాలపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. రైతులకు శాస్త్రీయ సాగు పద్ధతులు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి వ్యవసాయానికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.రైతుల సంక్షేమం కోసం నియమితులైన అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో లేదో ఉన్నతాధికారులు పరిశీలించి, నిర్లక్ష్యం ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.