దొంగ దీక్షలు, ధర్నాలను ప్రజలు నమ్మరు* *వైసీపీ నాయకుల దీక్షలపై ఎమ్మెల్యే పరిటాల సునీత స్పందన* *వేపకుంటలో రూ.1.25కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం*
అధికారంలో ఉండగా పేరూరు ప్రాజెక్టుకు నీరందించే పరిటాల రవీంద్ర కాలువ పనులు చేయకుండా ఇప్పుడు దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మరని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. కనగానపల్లి మండలం వేపకుంట గ్రామంలో రూ.1.25 కోట్ల అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సునీతకు స్థానిక ప్రజలు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 50లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సిసి రోడ్లను, 35 లక్షల ఆర్.డి.ఎస్.ఏ, ఉపాధి హామీ నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆమె ప్రారంభించారు. అలాగే 40లక్షల జల జీవన మిషన్ నిధులతో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా త్రాగునీటి సరఫరా చేయు పథకాన్ని కూడా ప్రారంభించారు. ఒకే గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ వేపకుంట గ్రామం అంటే పరిటాల రవీంద్రతో పాటు ఆయన తండ్రి శ్రీరాములుకు కూడా చాలా ఇష్టమన్నారు. మాకు ఎంతో మంది కుటుంబసభ్యుల్లాంటి వారు ఇక్కడ ఉన్నారన్నారు. గ్రామంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నట్టు చెప్పారు. ఈ పనులకు శంకుస్థాపన చేసినప్పుడు ఇవి ఎప్పటికి పూర్తి చేస్తారని కొందరు మాట్లాడారని.. కానీ 3నెలల్లోనే చేసి చూపించామన్నారు. పంచాయతీ భవనం, నీటి సమస్య తీరిందన్నారు. ప్రస్తుతం కొత్త పింఛన్లు కావాలని చాలా మంది దరఖాస్తు చేసుకున్నారని.. అర్హత ఉన్న వారికి కచ్చితంగా పార్టీలకతీతంగా ఇస్తామన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ సానుభూతిపరుల పింఛన్లు తొలగించారన్నారు. పేరూరు డ్యాంకు నీరు ఇచ్చేందుకు తాము కాలువ కోసం భూములు అడిగితే రైతులు ఉదారంగా ముందుకొచ్చారన్నారు. పార్టీ మారిన తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు కనీసం భూపరిహారం కూడా ఇవ్వలేదన్నారు. వారు ఆ రోజే ఈ పనులు పూర్తి చేసి ఉంటే.. పేరూరుకు నీరు వచ్చి ఉండేదన్నారు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయని.. దీనిపై విమర్శలు చేస్తున్న వారు కాలువ మీదకు వెళ్లి చూడాలన్నారు. కళ్లు ఉండి కూడా చూడలేని వారు మేము ఏమీ చేయలేదని.. ఇప్పుడు నీరు ఇవ్వాలంటూ దీక్షలు చేస్తున్నారని.. వారికి అంత చిత్తశుద్ధి ఉంటే గత ఐదేళ్లలో ఈ పనులు ఎందురు పూర్తి చేయలేదని నిలదీశారు. ఇక్కడ భూములిచ్చిన రైతులకు పరిహారం కచ్చితంగా అందిస్తామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయాన్ని స్వయంగా చెప్పారన్నారు. సోమరవాండ్లపల్లి రిజర్వాయర్ కూడా పూర్తి చేస్తామన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు గ్రామంలో 9ఎకరాల భూమి కొనుగోలు చేసి పట్టాలిచ్చామన్నారు. అయితే కొందరు ఇళ్లు కట్టుకోకపోవడం వలన ఆ తర్వాత వచ్చిన వైసీపీ వారు భూమిని ఆక్రమించారన్నారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్లినట్టు చెప్పారు. తహసీల్దార్ వెంటనే చొరవ తీసుకుని ఇక్కడ పేదలకు పట్టాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు భజన మందిరం కావాలని గ్రామస్తులు అడిగారని త్వరలో వాటిని మంజూరు చేయిస్తామని, ముఖ్యంగా ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలని.. మాటలు చెప్పే నాయకులకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సునీత పిలుపునిచ్చారు...