సెప్టెంబర్ 2 తర్వాత మంత్రి కొండా సురేఖపై చర్యలు..?
కేసీ వేణుగోపాల్ రాకపైనే ఉత్కంఠ
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా స్పందించే సూచనలు కనిపిస్తున్నాయి. కొండా సురేఖపై చర్యలు తీసుకునే అంశంపై సెప్టెంబర్ 2 తర్వాత కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన సెప్టెంబర్ 2న ఢిల్లీకి చేరుకోనున్నారు. కేసీ వేణుగోపాల్ రాక తర్వాతనే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఢిల్లీకి చేరుకున్న వెంటనే ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సులపై విస్తృతంగా చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
మరోవైపు, ఈ వివాదంలో రాయబారం నడిపేందుకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిరాకరించారు. కొండా సురేఖ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, ఈ అంశంపై ఇప్పటికే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రమశిక్షణ కమిటీ తీసుకునే నిర్ణయమే అంతిమమని తేల్చి చెప్పారు. దీంతో కేసీ వేణుగోపాల్ రాక తర్వాత అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.