తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆగస్టు 31 నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ఉచిత బ్రేక్‌ఫాస్ట్!
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం కీలక శుభవార్త అందిస్తోంది. ఇక ఉదయం పూట “ఆకలితో క్లాసులకు హాజరయ్యే పరిస్థితికి చెక్ పెట్టేందుకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆగస్టు 31 నుంచి మంచిర్యాల జిల్లాలో విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించనున్నారు.
సింగరేణి సీఎస్ఆర్ నిధులు, హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం మంచిర్యాల పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో సుమారు 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక రూఫ్‌టాప్ ఆటోమేటెడ్ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ఏర్పాటు చేశారు.
42 వేల మందికి పైగా విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్
ఈ కేంద్రీకృత వంటశాల ద్వారా భారీ సంఖ్యలో విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందించనున్నారు. 18 మండలాల్లోని 691 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 42,450 మంది విద్యార్థులకు, 13 జూనియర్ కాలేజీల్లోని 6,654 మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించేలా ఏర్పాట్లు చేశారు.
అంతేకాదు.. సుమారు 5 వేల మంది కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేలా కూడా కిచెన్‌లో ఏర్పాట్లు చేశారు. జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశంగా నిర్వాహకులు చెబుతున్నారు.
గంటలో వేలాది ఇడ్లీలు.. దోశలు, పూరీలు కూడా!
ఈ సెంట్రలైజ్డ్ కిచెన్‌లో వంట ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు. గంటకు 8 వేల ఇడ్లీలు, 3 వేల దోశలు, 5 వేలకు పైగా పూరీలు తయారు చేసే సామర్థ్యం ఈ కిచెన్‌కు ఉందని నిర్వాహకులు తెలిపారు.
అదే సమయంలో రెండు గంటల్లో సుమారు 5 వేల మంది విద్యార్థులకు సరిపడే సాంబార్, కూరలను తయారు చేయగల సామర్థ్యం కూడా ఉందని వెల్లడించారు. కేవలం 15 నిమిషాల్లోనే వెయ్యి మందికి సరిపడా అన్నం సిద్ధం చేసే ప్రత్యేక పరికరాలు కూడా అందుబాటులో ఉంచారు.
ఆధునిక సదుపాయాలతో భారీ కిచెన్
విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించేందుకు కిచెన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వెజిటబుల్ వాషింగ్, కటింగ్ యూనిట్లతో పాటు మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్, ఆర్వో వాటర్ ప్లాంట్, బాయిలర్ ప్లాంట్, సెంట్రల్ గ్యాస్ బ్యాంక్, వ్యర్థ నీటి శుద్ధి ప్లాంట్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు.
పూర్తిగా శాఖాహార ఆహారాన్ని అందించనున్నట్లు కిచెన్ ఏజీవీఎం సందీప్ సింగ్ తెలిపారు. ఆహారం తయారీ నుంచి పంపిణీ వరకు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని నిర్వాహకులు వెల్లడించారు.
ఎమ్మెల్యే పరిశీలన
మంచిర్యాల స్థానిక ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు సెంట్రలైజ్డ్ కిచెన్‌ను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఏ విద్యార్థి కూడా అర్థాకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆగస్టు 31 నుంచి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అల్పాహార పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.