భారత్‌లో వైద్య, నర్సింగ్ విద్య భారీ విస్తరణ
న్యూఢిల్లీ: దేశంలోని గ్రామీణ, గిరిజన మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక వైద్య సంరక్షణను సమానంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వైద్య, నర్సింగ్ మరియు అనుబంధ ఆరోగ్య రంగాన్ని భారీగా విస్తరిస్తోంది. తైమోర్-లెస్టేలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి. నడ్డా ఈ విషయాలను వెల్లడించారు.
2014 నుండి దేశంలో వైద్య కళాశాలల సంఖ్య 387 నుండి 121.71 శాతం పెరుగుదలతో 858కి చేరిందని ఆయన తెలిపారు. అలాగే ఎంబీబీఎస్ సీట్లు 51,348 నుండి 1,42,464కు, పీజీ సీట్లు 31,185 నుండి 86,287కు పెరిగాయి. 2028-29 నాటికి అదనంగా మరో 10,000 పీజీ సీట్లను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎమర్జెన్సీ మెడిసిన్, జెరియాట్రిక్స్, సైకియాట్రీ మరియు ఫ్యామిలీ మెడిసిన్ వంటి రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
మరోవైపు 157 కొత్త నర్సింగ్ కళాశాలల ఏర్పాటు ద్వారా ఏటా అదనంగా 15,700 మంది నర్సింగ్ గ్రాడ్యుయేట్లకు అవకాశం కల్పిస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో 1 లక్ష మంది అనుబంధ ఆరోగ్య నిపుణులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా 57 వృత్తులను నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ చట్టం కింద ఒక క్రమబద్ధమైన పరిధిలోకి తీసుకువచ్చారు.
మారుమూల ప్రాంతాల ప్రజలకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ఈ-సంజీవని మరియు ABHA డిజిటల్ రికార్డుల ద్వారా టెలికన్సల్టేషన్ సేవలు అందిస్తున్నామని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్య దేశాలు 'దిలీ ప్రకటన'ను ఆమోదించాయి. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలలో వైద్యుల లభ్యత, టెలిమెడిసిన్, ఏఐ సాంకేతికత మరియు క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల నివారణకు సమగ్ర చర్యలు తీసుకోనున్నారు.