ఉక్రెయిన్ యుద్ధానికి త్వరితగతిన ముగింపు పలకాలి
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ ఫోన్ సంభాషణ
మాస్కో: ఉక్రెయిన్‌లో యుద్ధం త్వరితగతిన ముగియాలని, తద్వారా అమెరికా-రష్యా సంబంధాలు పూర్తిగా పునరుద్ధరించబడతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిపిన ఫోన్ సంభాషణలో స్పష్టం చేసినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. సుమారు ఒక గంట పాటు సాగిన ఈ ఫోన్ సంభాషణలో ట్రంప్ అభిప్రాయానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ పూర్తి మద్దతు తెలిపారని క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషాకోవ్ మీడియాకు వివరించారు. అమెరికా రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌లు మాస్కో, కీవ్‌లలో జరిపిన దౌత్య పర్యటనల అనంతరం ఇరు దేశాల అగ్రనేతల మధ్య ఈ చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధభూమిలోని ప్రస్తుత పరిస్థితులను, యుద్ధ నివారణకు అమెరికా చేయగలిగిన సహాయాన్ని పుతిన్ వివరించారని ఉషాకోవ్ తెలిపారు. యుద్ధానికి ముగింపు పలికితే ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలు మెరుగుపడతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ఖైదీల మార్పిడిని కొనసాగించేందుకు ఇరు నాయకులు అంగీకరించారు. యూరోపియన్ దేశాలపై రష్యాకు ఎలాంటి శత్రుపూరిత ఉద్దేశాలు లేదా దురాక్రమణ ప్రణాళికలు లేవని, రష్యా ముప్పు పేరిట జరుగుతున్న ప్రచారం కేవలం సైనిక వ్యయాన్ని పెంచుకోవడానికి యూరప్ చెప్తున్న సాకు మాత్రమేనని పుతిన్ ఈ సంభాషణలో స్పష్టం చేశారు.