అమెరికా చమురు ట్యాంకర్ల ధ్వంసం
అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడి
వాషింగ్టన్/టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో ఘర్షణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అమెరికా నౌకాదళ యుద్ధనౌకలపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేయడానికి ప్రయత్నించడంతో, ప్రతిస్పందనగా ఐదు ఇరాన్ ముడి చమురు రవాణా ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు అమెరికా సైనిక దళాల సెంట్రల్ కమాండ్ మంగళవారం ప్రకటించింది. తమ నౌకలపై దాడికి తెగబడితే ప్రతిసారీ ట్యాంకర్లను కోల్పోక తప్పదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో హెచ్చరించారు.
ఈ దాడులకు ప్రతీకారంగా జోర్డాన్‌లోని 'అల్ అజ్రాక్' వద్ద ఉన్న అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ 20 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిలో 18 క్షిపణులను తమ వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని, మిగిలిన రెండు ఖాళీ ప్రదేశాల్లో పడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని జోర్డాన్ వెల్లడించింది. అలాగే కువైట్, బహ్రెయిన్ ఓడరేవులలోని చమురు ట్యాంకర్లను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.
మరోవైపు, ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ మిలీషియా దళాలు సౌదీ అరేబియాలోని ఖమీస్ ముషైత్, అభా, నజ్రాన్ మరియు జాజాన్ నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేశాయి. 'ఆరామ్‌కో' చమురు కేంద్రాలపై జరిగిన ఈ దాడుల్లో 73 మంది గాయపడ్డారు. ఈ పరిణామాలతో హోర్ముజ్ జలసంధి పరిధిలో చమురు రవాణా నిలిచిపోయి, ప్రపంచ ఇంధన విపణిలో తీవ్ర ఆందోళన నెలకొంది.