ప్రపంచ వ్యాక్సిన్ సరఫరాలో భారత్ అగ్రస్థానం
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
న్యూఢిల్లీ:పరిమాణం పరంగా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారుగా మరియు ప్రపంచ వ్యాక్సిన్ సరఫరాదారుగా అవతరించిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఆదివారం న్యూఢిల్లీలో 'కోయలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్' (CEPI) బోర్డు, ఇన్వెస్టర్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా నిర్వహించిన ఉన్నత స్థాయి సాయంత్రపు విందులో ఆయన మాట్లాడారు.
ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ దాదాపు 60 శాతం వాటాను కలిగి ఉందనే విషయాన్ని కేంద్ర మంత్రి నొక్కి చెప్పారు. అంతేకాకుండా, 100కు పైగా దేశాలకు వ్యాక్సిన్‌లను సరఫరా చేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సాధారణ రోగనిరోధక అవసరాలలో 65 శాతానికి పైగా తీరుస్తోందని తెలిపారు. దేశంలో బయోఎకానమీ వేగంగా వృద్ధి చెందుతోందని, దాని విలువ 2025 నాటికి 195.3 బిలియన్ డాలర్లకు చేరుకుందని వివరించారు. భారత్ తన వ్యాధుల స్వరూప వైవిధ్యాన్ని శాస్త్రీయ అధ్యయనాలకు వ్యూహాత్మక ప్రయోజనంగా మలచుకుంటోందని చెప్పారు.
అలాగే, అక్టోబర్ 2019లో ప్రారంభమైన DBT-BIRAC-CEPI భాగస్వామ్యం సెప్టెంబర్ 2025లో మరో ఐదేళ్లపాటు పునరుద్ధరించబడిందని గుర్తుచేశారు. ఈ భాగస్వామ్యం ద్వారా GEMCOVAC-19, చికున్‌గున్యా, మంకీపాక్స్ వంటి వ్యాధులకు అధునాతన వ్యాక్సిన్‌ల అభివృద్ధిలో గణనీయమైన ప్రగతి సాధించినట్లు వెల్లడించారు.