జావా సముద్రంలో ఫెర్రీ ప్రమాదం.. 6 మంది మృతి
ఇండోనేషియాలోని జావా సముద్రంలో ఓ ఫెర్రీ ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఫెర్రీతో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. నౌకలో మొత్తం 243 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందగా, 107 మందిని రక్షించారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
బంజర్మసిన్‌కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఫెర్రీ చివరిసారిగా గుర్తించబడినట్లు అధికారులు వెల్లడించారు. నౌకలు, హెలికాప్టర్ల సహాయంతో విస్తృత స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 280 మంది సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. జావా సముద్రంలోని ఇతర నౌకలను కూడా ఇండోనేషియా అధికారులు అప్రమత్తం చేశారు.