పశ్చిమ పసిఫిక్ సముద్రగర్భంలో అపార స్వర్ణ నిక్షేపాలు: చైనా పరిశోధకుల సంచలన గుర్తింపు
సూర్యా న్యూస్ డెస్క్
పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర గర్భంలో బంగారం, వెండి ఖనిజ నిక్షేపాలను చైనా పరిశోధకులు కనుగొన్నారు. 18 రోజుల పాటు సాగిన సుదీర్ఘ సముద్ర పరిశోధనల్లో లభ్యమైన శాంపిళ్ల విశేషాలపై ప్రత్యేక కథనం.
సముద్ర గర్భంలో దాగివున్న ప్రకృతి సంపదను వెలికితీసేందుకు సాగుతున్న పరిశోధనల్లో చైనా శాస్త్రవేత్తలకు భారీ విజయం లభించింది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం అడుగున అత్యంత విలువైన అపార బంగారం, వెండి ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు చైనా పరిశోధ బృందం గురింపును అధికారికంగా వెల్లడించింది. భూభాగంపై లభించే నిల్వలతో పోలిస్తే ఇవి పరిమాణంలో ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ పరిశోధనల కోసం సైంటిస్టుల బృందం ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రారంభించి సుమారు 18 రోజుల పాటు పసిఫిక్ సముద్రంలో సుదీర్ఘ అన్వేషణ సాగించింది. సముద్ర గర్భంలో లోతైన ప్రాంతాల నుంచి సేకరించిన ముడి పదార్థాల శాంపిళ్లను ప్రయోగశాలల్లో విశ్లేషించగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిశోధనల్లో లభ్యమైన ప్రతి ఒక టన్ను ముడి ఖనిజంలో 15.4 పిపిఎమ్ (గ్రాములు) బంగారం, అలాగే 1,271 పిపిఎమ్ (గ్రాములు) వెండి నిల్వలు ఉన్నట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయింది.
సముద్రపు లోతుల్లో సంభవించే భౌగోళిక ప్రక్రియల కారణంగా ఏర్పడిన ఈ ఖనిజ నిక్షేపాలు అత్యంత నాణ్యమైనవిగా పరిశోధకులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ నిక్షేపాలను వెలికితీసేందుకు సంబంధించి మరింత విస్తృత స్థాయి అధ్యయనాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ జలాల్లో ఈ తరహా విలువైన లోహాల గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ మరియు పరిశోధనా రంగాల్లో కొత్త ఆసక్తికి దారితీస్తోంది.