వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష: మండపాలకు ఉచిత విద్యుత్ ప్రకటన
సూర్యా న్యూస్ డెస్క్
హైదరాబాద్‌లో జరిగే గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని ప్రకటించడంతో పాటు భద్రత, సమన్వయానికి సంబంధించిన పలు కీలక ఆదేశాలను జారీ చేశారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమాలను శాంతియుతంగా, ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే వినాయక చవితి వేడుకల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఉన్నతాధికార సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని వెల్లడించారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, నిర్వాహకులు తగిన ధ్రువీకరణ ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ఉత్సవాల సందర్భంగా తలెత్తే సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకే తానే స్వయంగా ఈ సమీక్ష చేపట్టినట్లు తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణ ప్రాధాన్యతను వివరిస్తూ, భాగ్యనగరం ప్రశాంతంగా ఉన్నప్పుడే నగరానికి కొత్త పెట్టుబడులు తరలివస్తాయని సీఎం పేర్కొన్నారు. వినాయక మండపాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారనే సమాచారాన్ని స్థానిక పోలీసులకు ముందస్తుగా తెలియజేయాలని కోరారు. అలాగే మండపాలకు ప్రముఖులను ఆహ్వానించే విషయాన్ని కమిషనరేట్‌కు తెలియజేస్తే, ఏదైనా అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ముందస్తు భద్రతా చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.
చెరువుల వద్ద నిమజ్జనానికి క్రేన్ల ఏర్పాటును సులభతరం చేయడంతో పాటు, బతుకమ్మ తరహాలోనే శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. వేడుకలు పూర్తయ్యే వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా మున్సిపల్, పోలీస్ విభాగాలు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, సమన్వయం కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు.