అంతరిక్ష ఆయుధీకరణను నివారించాలి
బ్రిక్స్ 'న్యూఢిల్లీ ప్రకటన' పిలుపు
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగాన్ని కేవలం శాంతియుత ప్రయోజనాలకే వినియోగించాలని, బాహ్య అంతరిక్షంలో ఆయుధ పోటీ (PAROS) మరియు ఆయుధీకరణను అడ్డుకోవాలని బ్రిక్స్ కూటమి పిలుపునిచ్చింది. న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించిన 'న్యూఢిల్లీ ప్రకటన'లో సభ్య దేశాల నాయకులు అంతరిక్ష అన్వేషణ, సుస్థిరతపై కీలక తీర్మానం చేశారు. అంతరిక్ష వస్తువులపై ఎలాంటి బెదిరింపులు లేదా బలప్రయోగాలు జరగకుండా నిరోధించేందుకు అంతర్జాతీయ చట్టబద్ధమైన నిబంధనలు తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు.
వాతావరణ మార్పులు, సామాజిక-ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో 'బ్రిక్స్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ కాన్‌స్టలేషన్' (RRSC) అందిస్తున్న సేవలను నాయకులు కొనియాడారు. అంతరిక్ష రంగంలో సభ్య దేశాల మధ్య ఉన్న అసమానతలను తొలగించడంతో పాటు, బెంగళూరు సదస్సులో చర్చించినట్లు అంతరిక్ష వ్యర్థాల (Space Debris) నివారణకు ఉమ్మడి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. నూతన సభ్యులను చేర్చుకునేలా ఆర్‌ఎస్‌ఎస్‌సి ఒప్పందానికి సవరణలు ఖరారు చేయడం, 'బ్రిక్స్ స్పేస్ కౌన్సిల్' ఏర్పాటు ప్రక్రియలో పురోగతి సాధించడాన్ని కూటమి అగ్రనేతలు స్వాగతించారు.