గాంధీనగర్‌లో ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరమ్ 2026
సెప్టెంబర్ 15 నుంచి భారత్ ఆతిథ్యం
న్యూఢిల్లీ/గాంధీనగర్:గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సెప్టెంబర్ 15 నుండి 18 వరకు జరగనున్న ‘ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరమ్ (WCEF) 2026’కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. దక్షిణాసియాలో ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ స్థాయి ఫోరమ్ నిర్వహించబడటం ఇదే తొలిసారి. ‘సర్క్యులర్ ఎకానమీ: ప్రజలు మరియు శ్రేయస్సు కోసం పరివర్తన’ అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ సదస్సును కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ సెప్టెంబర్ 15న సంయుక్తంగా ప్రారంభించనున్నారు.
ఈ అంతర్జాతీయ సదస్సును భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB), గుజరాత్ ప్రభుత్వం, గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫిన్లాండ్ ప్రభుత్వం మరియు ఫిన్నిష్ ఇన్నోవేషన్ ఫండ్ (సిట్రా) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 65కు పైగా దేశాల నుంచి 2,000 మందికి పైగా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలు, పరిశోధకులు ఇందులో పాల్గొననున్నారు.
ఈ ఫోరమ్‌లో వనరుల పునర్వినియోగం, స్థిరమైన ఉత్పత్తి, పునఃచక్రీయం (రీసైక్లింగ్) వంటి వలయాకార ఆర్థిక పద్ధతులపై ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాకుండా, 125కు పైగా ప్రదర్శనశాలలతో కూడిన ఎక్స్‌పోను కూడా ఏర్పాటు చేస్తున్నారు. WCEF 2026 సందర్భంగా '10-ఏళ్ల కార్యక్రమాల చట్రం' (10 YFP) బోర్డు సమావేశానికి భారత్ సహ-అధ్యక్షత వహించనుంది. చివరి రోజున 'సిట్రా' అంతర్జాతీయ కార్యక్రమాల డైరెక్టర్ క్రిస్టో లెహ్టోనెన్ తదుపరి ఆతిథ్య దేశానికి అధికారికంగా బాధ్యతలను అప్పగించడంతో ఈ ఫోరమ్ ముగియనుంది.