భారత్‌తో చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి న్యూజిలాండ్ పార్లమెంట్ ఆమోదం.. అక్టోబర్ నుంచి అమల్లోకి?
సూర్య జాతీయ డెస్క్: భారత్ మరియు న్యూజిలాండ్ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక బంధం మరింత బలపడింది. రెండు దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) న్యూజిలాండ్ పార్లమెంట్ ఘనంగా ఆమోదం తెలిపింది. బుధవారం పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 93 ఓట్లు, వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. ఏప్రిల్ 27న రెండు దేశాలు సంతకాలు చేసిన ఈ చారిత్రక ఒప్పందం పార్లమెంట్ ఆమోదం పొందడంతో త్వరలోనే అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం అక్టోబర్ నెల నుంచే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు వెల్లడించారు.
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేశారు. భారతదేశంలోని 140 కోట్ల మంది వినియోగదారులతో కూడిన భారీ మార్కెట్ తమ దేశ ఉత్పత్తిదారులకు అందుబాటులోకి వస్తుందని, దీనివల్ల న్యూజిలాండ్‌లో ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం కింద న్యూజిలాండ్ వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో దాదాపు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. భారత ఎగుమతుల్లో 100 శాతం ఉత్పత్తులకు న్యూజిలాండ్ సుంకరహిత ప్రవేశాన్ని కల్పిస్తోంది. దీనివల్ల భారత్‌లోని టెక్స్‌టైల్స్, దుస్తులు, పాదరక్షలు, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఇంజనీరింగ్ వస్తువులు మరియు ప్రాసెస్ చేసిన ఆహార రంగాలు ఎంతో ప్రయోజనం పొందనున్నాయి.
ఈ ఒప్పందం ద్వారా భారతీయ విద్యార్థులు, నిపుణులకు న్యూజిలాండ్‌లో సరికొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. నైపుణ్యం కలిగిన 5,000 మంది భారతీయులకు మూడేళ్ల కాలపరిమితితో తాత్కాలిక ఉపాధి వీసాలను అందించనున్నారు. ఇందులో ఆయుష్ నిపుణులు, యోగా శిక్షకులు, భారతీయ షెఫ్‌లు, సంగీత ఉపాధ్యాయులతో పాటు ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్, విద్యారంగ నిపుణులకు చోటు కల్పించారు. ప్రతి ఏటా 1,000 మంది భారతీయ యువతకు వర్కింగ్ హాలిడే వీసాలు మంజూరు చేస్తారు. అలాగే న్యూజిలాండ్‌లో చదువుకునే భారతీయ విద్యార్థులు చదువుకుంటూనే వారానికి 20 గంటల పాటు పనిచేసుకునే వెసులుబాటుతో పాటు, కోర్సు పూర్తయిన తర్వాత వర్క్ వీసా పొందే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.