గాజా శిథిలాల తొలగింపు 'సాక్ష్యాల' విధ్వంసమే
ఐక్యరాజ్యసమితి నిపుణురాలు ఫ్రాన్సెస్కా అల్బనీస్ ఆందోళన
జెనీవా: ఇజ్రాయెల్ బలగాలు గాజాలో పేరుకుపోయిన శిథిలాలను తొలగించడం వల్ల అక్కడ జరిగిన "ఘోరమైన నేరాల" ఆధారాలు నాశనమయ్యే ప్రమాదం ఉందన ఐక్యరాజ్యసమితి నిపుణురాలు ఫ్రాన్సెస్కా అల్బనీస్ హెచ్చరించారు. గాజాలో శిథిలాలు కేవలం నిర్మాణ వ్యర్థాలు మాత్రమే కాదని, అది ఒక నేర ప్రదేశమని, అమాయకుల స్మశానవాటిక అని ఆమె పేర్కొన్నారు. పూర్తిస్థాయి వ్యర్థాల తొలగింపునకు ముందే అక్కడ లభ్యమయ్యే సాక్ష్యాలను సేకరించడంతో పాటు, శిథిలాల కింద చిక్కుకున్న పాలస్తీనియన్ల అవశేషాలను వెలికితీయాలని ఆమె సోమవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.
2023 అక్టోబర్ నుండి సాగుతున్న ఇజ్రాయెల్ మిలిటరీ చర్యల వల్ల గాజాలో దాదాపు 6.1 మిలియన్ టన్నుల శిథిలాలు పేరుకుపోయాయని, వీటిని పూర్తిగా తొలగించడానికి కనీసం ఏడేళ్లు పడుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అయితే ఈ తొలగింపు ప్రక్రియలో ఇజ్రాయెల్ కంపెనీలు పాలుపంచుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రచ్ఛన్న యుద్ధం తరహా దాడుల వల్ల గాజా ఆరోగ్య అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు 73,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించగా, మరో 8,000 మందికి పైగా శిథిలాల కిందే పూడిపోయి ఉంటారని పాలస్తీనా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్ష్యాల భద్రత మరియు మృతదేహాల వెలికితీత ఆవశ్యకతపై అల్బనీస్ చేసిన హెచ్చరికలకు హమాస్ కూడా మద్దతు తెలిపింది.