ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పాక్షికంగా మేఘావృతమైన ఆకాశం
తేలికపాటి వర్షం సూచన
న్యూఢిల్లీ:జాతీయ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ పరిధిలోని ప్రాంతాల్లో రాబోయే కొద్దిరోజుల పాటు సాధారణంగా మేఘావృతమైన వాతావరణం నెలకొని, తేలికపాటి చినుకులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) మంగళవారం వెల్లడించింది. సెప్టెంబర్ 11 నుండి ఢిల్లీలో మరో విడత తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముండగా, గాలిలో తేమ శాతం అధికంగా ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రస్తుతానికి ఎలాంటి ప్రత్యేక హెచ్చరికలు జారీ చేయనప్పటికీ, నోయిడా మరియు గురుగ్రామ్‌లలో ఉష్ణోగ్రతలు 31 నుండి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని తెలిపింది.
కాగా, దేశంలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా సాగుతున్నాయని ఐఎమ్‌డి పేర్కొంది. ఉత్తర ప్రదేశ్, బీహార్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్ సహా 17 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల గాలి వేగం గంటకు 65 నుండి 70 కిలోమీటర్ల వరకు చేరవచ్చని తెలిపారు. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లలో సెప్టెంబర్ 13 వరకు వర్షాలు కొనసాగుతాయని ఐఎమ్‌డి స్పష్టం చేసింది.