అమెరికాలో విమానాలు తయారు చేయకుంటే అమ్మకాలు బంద్
బాంబార్డియర్‌పై ట్రంప్ హెచ్చరిక
అమెరికా: కెనడాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ జెట్ తయారీ సంస్థ 'బాంబార్డియర్' అమెరికాలోనే తన విమానాల తయారీని ప్రారంభించకపోతే, ఆ దేశంలో విక్రయించేందుకు అనుమతించబోమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "అమెరికాలో ఇకపై బాంబార్డియర్ అమ్మకాలు ఉండవు, వారి ఉత్పత్తులు అంత మంచివి కావు. వారికి మన మార్కెట్ కావాలంటే ఇక్కడే తయారు చేయాలి. అమెరికాను ఒక దాగుడుమూతల పెట్టెలా చూడటం ఆపాలి" అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేశారు. అమెరికా, కెనడాల మధ్య వాణిజ్య వివాదం ముదురుతున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
కెనడా మంగళవారం నుండి అమెరికాపై ప్రతి-టారిఫ్‌ల (సుంకాల) పరంపరను ప్రారంభించనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా, దీనిపై వైట్ హౌస్ స్పందించలేదు. అయితే అమెరికాలో బాంబార్డియర్ సంస్థకు ముగ్గురు వేల ఐదు వందల మంది ఉద్యోగులు, 2,800 మంది సరఫరాదారులు ఉన్నారు. ప్రతి సంవత్సరం అమెరికా సరఫరాదారుల కోసం ఈ సంస్థ 2.5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు చేస్తోంది. అంతేకాకుండా ఈ ప్రైవేట్ జెట్లలో ఎక్కువగా హనీవెల్, జీఈ ఏరోస్పేస్ వంటి అమెరికన్ కంపెనీల ఇంజన్లనే ఉపయోగిస్తున్నారు.
ట్రంప్ హెచ్చరికలపై బాంబార్డియర్ స్పందిస్తూ... అమెరికాలో తమ పెట్టుబడులను, కమ్యూనిటీ ఆధారిత కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. గతంలో కూడా ఇటువంటి సుంకాల బెదిరింపులు ఎదురైనప్పటికీ, ఏరోస్పేస్ రంగంలో అమెరికా-కెనడాల మధ్య ఉన్న పరస్పర అనుబంధం వల్ల దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది విశ్లేషకుల్లో సందేహంగా మారింది.