నేర్చుకుంటూనే ఉందాం
మనిషి సహజంగా సుఖం కోరుకుంటాడు. ఆనందం, శాంతి, సంతృప్తి ఆశిస్తాడు. అందుకు ధనార్జన ఒక్కటే ముఖ్యమనుకుంటున్నాడు. నిజానికి ప్రపంచంలో ఎంతమంది శ్రీమంతులు సుఖజీవనం గడుపుతున్నారు? ఒక్కసారి పరిశీలిస్తే వాస్తవం తెలుస్తుంది.
మనిషి డబ్బు వెంట పరుగెత్తకూడదు. డబ్బే మనిషి వెనకాల నడవాలి. అప్పుడే జీవితం సార్థకమవుతుంది. అంతటితో అయిపోతుందా? జీవన సార్థక్యం పొందాలంటే ప్రతి మనిషీ తన రంగంలో, వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యం సంపాదించుకోవాలి. చేస్తున్న పనిలో చిత్తశుద్ధి ఉండాలి. తనను తాను మార్పునకు సిద్ధంగా ఉంచుకోవాలి. అభ్యున్నతి సాధించాలి. ఆర్జించిన విద్యలో మరెన్నో మెలకువలు నేర్చుకోవాలి. ఆయా రంగాల్లో నిష్ణాతులైనవారిని, అనుభవజ్ఞులను సంప్రదించాలి. ఎందులోనైనా తృప్తి పడవచ్చేమో కానీ, వచ్చిన విద్యలో రాణింపు కోసం నిత్యం తపించడం మాత్రం మానకూడదు. కుతూహలాన్ని, ఆసక్తిని పెంపొందించుకుంటూనే ఉండాలి. నేర్చుకోవాలనే ఆకలిని పెంచుకుంటూనే ఉండాలి. నేర్చుకోవడంలో తృప్తి అనేది ఉండకూడదు.
ఈ దేహం మనకు లభించిన అద్దె ఇల్లు. కట్టాల్సిన అద్దె ఏంటంటే- జ్ఞానం. అది పుట్టుకతో వచ్చేది కాదు. తల్లి నుంచి, తండ్రి నుంచి నేర్చుకోవాలి. అలాగే గురువు, బంధుమిత్రులు, సమాజంలోని ప్రతి వ్యక్తి నుంచి ఆయా సందర్భాలు, పరిస్థితుల్ని బట్టి నేర్చుకోవడం అనివార్యం. లోకంలో ప్రతి మనిషీ మరొకరికి గురువే. ఒకరికి లేని జ్ఞానం మరొకరికి ఉండవచ్చు. అది నేర్చుకోవాలంటే వినయం, విధేయత, శ్రద్ధ, పట్టుదల, ముందుచూపు, నిరంతర శ్రమ- ఇవన్నీ అవసరమే. పూర్వీకులు మనకు అపారమైన వాఙ్మయనిధిని ఇచ్చారు. వారంతా ఎంతో మంది నుంచి ఏదో విధమైన కళను, విద్యను నేర్చుకున్నవారే. రామాయణ, భారత, భాగవతాలు, భగవద్గీత అంతకుముందే వచ్చిన వేదాలు, ఉపనిషత్తులు, ఇత్యాది గ్రంథాలు అధ్యయనం చేసి రేపటి తరాలకు దిశానిర్దేశం చేయవచ్చు. వడ్డించిన విస్తరిలా అనంత జ్ఞాన జలధి మన ముందున్నా మనం లౌకిక శ్లేష్మంలో పడి ఈగల్లా కొట్టుకుంటున్నాం. ఎన్ని గ్రంథాలనైనా చదివి అర్థం చేసుకోవచ్చు. మనిషిని చదవడం కష్టం. సమాజాన్ని చదవడం కష్టం. అందుకే కైక మంధరను అర్థం చేసుకోలేకపోయింది. దుర్యోధనుడికి శకుని కుట్ర బోధపడలేదు. తపోదీక్షకు ఉన్న మహిమను విశ్వామిత్రుడు అర్థం చేసుకోలేకపోయాడు. విదురుడి హితవచనాల్ని ధృతరాష్ట్రుడు ఒంటబట్టించుకోలేకపోయాడు. తమ్ముడు విభీషణుడి హెచ్చరిక వెనక ఆంతర్యాన్ని రావణుడు పసిగట్టలేకపోయాడు.
శరీరమనే ఇంటిని ఖాళీ చేసి వెళ్లక ముందు మనం రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి నిరంతరం చైతన్య స్ఫూర్తిని రగిలించే జ్ఞానం. రెండోది నేర్చుకున్నదంతా సాటి మానవులకు అప్పగించడం. జీవితం మూసిన పుస్తకం. ఏ పుటలో ఏముంటుందో తెలియదు. అందుకే అప్రమత్తత, మంచికోసం దేనికైనా సిద్ధపడగలిగే తెగింపు అవసరం. ఎంతగా నేర్చుకుంటే అంతగా కీర్తి పొరలను పేర్చుకుంటూ పోగలం. బతుకంతా నేర్చుకోవాలన్న సంకల్పశుద్ధి సత్ఫల సిద్ధికి సముచిత బీజం????️????????️